సమన్వయంతో కోవిడ్‌ టీకా

7 Jan, 2021 04:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు త్వరలో చేపట్టనున్న టీకాల ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలు  సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సూచించారు. తొలి విడతలో కోటి మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్‌ టీకాలకు సంబంధించి బుధవారం సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేట్‌ హెల్త్‌ కేర్‌ సిబ్బందితో పాటు ఐసీడీఎస్‌ వర్కర్లతో కలిపి 3.70 లక్షల హెల్త్‌కేర్‌ సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించనున్నట్లు వివరించారు. పోలీసులు, ఆర్మ్‌డ్‌ ఫోర్సు, హోంగార్డులు, జైళ్ల సిబ్బంది, విపత్తు నిర్వహణ సంస్థ వలంటీర్లు, సివిల్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్, మున్సిపల్‌ వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది తదితర 9 లక్షల మందికి టీకా అందిస్తామన్నారు. 50 ఏళ్లు దాటి షుగర్, బీపీ, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి తొలివిడత కోవిడ్‌ టీకాల్లో ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. టాస్‌్కఫోర్స్‌ కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై సమీక్షిస్తాయని చెప్పారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ఫిర్యాదులు, సలహాల కోసం ఏర్పాటైన కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలు పని చేస్తాయన్నారు. 

1,677 కోల్డ్‌ చైన్‌ పాయింట్లు
వ్యాక్సిన్‌ నిల్వ, సరఫరా, కోల్డ్‌ చైన్ల నిర్వహణ, ఐస్‌ బాక్సులు, ప్రీజర్లు తదితర అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. తొలి విడత వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,677 కోల్డ్‌ చైన్‌ పాయింట్లు (వ్యాక్సిన్‌ స్టోరేజి పాయింట్లు) సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కె.భాస్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. టీకా రవాణా కోసం 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉషో్ట్ణగ్రత ఉండేలా 19 ఇన్సులేటెడ్‌ వ్యాక్సిన్‌ వ్యాన్లను సిద్ధం చేశామని, మరో 26 సిద్ధమవుతున్నాయని తెలిపారు. 17,032 మంది వ్యాక్సినేటర్లు (ఎఎన్‌ఎం), 7,459 ఆరోగ్య ఉప కేంద్రాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. పది కోట్ల డోసులకు సరిపడే కోల్డుచైన్‌ నిర్వహణకు స్థలం ఉందని చెప్పారు.  

మరిన్ని వార్తలు