ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరి

25 Aug, 2021 02:48 IST|Sakshi

అన్ని శాఖలకు సర్క్యులర్‌ మెమో జారీ చేసిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌    

సాక్షి, అమరావతి: సచివాలయంతో పాటు శాఖాధిపతులు, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల బయో మెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తక్షణం సచివాలయంను అన్ని శాఖలతో పాటు శాఖాధిపతులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆదేశిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం సర్క్యులర్‌ మెమో జారీ చేశారు. గతంలో సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో బయోమెట్రిక్‌ హాజరు ఉందని, అయితే కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో బయోమెట్రిక్‌ హాజరును నిలుపుదల చేసినట్లు మెమోలో పేర్కొన్నారు.

కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని ఇటీవల జరిగిన కార్యదర్శులు సమావేశంలో నిర్ణయించినట్లు మెమోలో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు నెలవారీ నివేదికలను సమర్పించాలని సీఎస్‌ ఆదేశించారు. బయోమెట్రిక్‌ హాజరు పరికరాలు సక్రమంగా పనిచేసేలా ఐటీ శాఖతో పాటు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు