ఆన్‌లైన్‌ రుణాలపై అప్రమత్తంగా ఉండాలి

20 Mar, 2021 05:06 IST|Sakshi

రిజిస్టర్‌ కాని బోగస్‌ చిట్‌ఫండ్‌ కంపెనీల్లో నిధులు డిపాజిట్‌ చేయవద్దు 

సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ 

సాక్షి, అమరావతి: డిజిటల్‌ లెండింగ్‌ యాప్, ఆన్‌లైన్‌ రుణాల మంజూరు యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ విజ్ఞప్తి చేశారు. రిజర్వు బ్యాంకు అఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అగ్రిగోల్డు, అక్షయ గోల్డు, హీరా గ్రూప్, కపిల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్, ఆదర్శ్‌ మల్టీస్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ.. తదితర చిట్‌ఫండ్‌ కంపెనీలపై నమోదైన కేసులను సమీక్షించారు. అన్‌ రిజిస్టర్డ్, బోగస్‌ చిట్‌ ఫైనాన్స్‌ కంపెనీల మోసాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో డిజిటల్‌ లెండింగ్‌ ఏజెన్సీలు ఎక్కువై ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఋణాలు మంజూరు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. ఇటువంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని, ఏదైనా కంపెనీ లేదా సంస్థ యాప్‌ ద్వారా అలాంటి మోసాలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాంటి ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ జరిపి కేసులు నమోదు చేసి సకాలంలో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. బోగస్‌ చిట్‌ఫండ్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆర్బీఐ, పోలీస్, రిజి్రస్టార్‌ ఆఫ్‌ చిట్స్, సంబంధిత శాఖల అధికారులు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. 

సమన్వయంతో పనిచేయాలి 
ఫైనాన్స్‌ కంపెనీలు, చిట్‌ఫండ్‌ కంపెనీల వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హోం, న్యాయ, సీఐడీ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వీటి బాధితులకు సకాలంలో న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ, సీఐడీ తదితర విభాగాలకు సూచించారు. ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ నిఖిల, సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్,  సహకార మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్స్‌ బాబు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి సునీత, ఆర్బీఐ జీఎం జయకుమార్, ఏజీఎంలు పద్మనాభన్, ఉదయ్‌కృష్ణ, మోహన్, డిప్యూటీ లీగల్‌ అడ్వయిజర్‌ మెహతా పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు