వారొస్తేనే మిర్చి కోతలు.. వలస కూలీల బతుకుచిత్రం ఇది..

22 Apr, 2022 19:28 IST|Sakshi
ఉదయాన్నే కూలి పనులకు వెళుతున్న ఆదివాసీలు 

సాక్షి, ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు.. సమష్టిగా పనిచేయడం.. వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వారి నైజం. కల్మషం లేని హృదయాలు వారివి. వారంతా వలస కూలీలు. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలీ పనుల కోసం ఏజెన్సీకి వలస వచ్చి మూడునెలల కాలం ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలతో పాటు తెలంగాణలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తారు.

అయితే మిర్చి కోతలకు జనవరి ప్రారంభంలోనే కూలీలు కుటుంబ సమేతంగా తిండి గింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే వీరొస్తేనే మిర్చి పంట చేతికొచ్చేది. ఏజెన్సీలో సుమారు 8 వేల మంది వలస కూలీలు ఈ నెల చివరి వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు.


మిర్చి తోటల్లోనే భోజనం చేస్తున్న కూలీలు  

ఆహారపు అలవాట్లు
వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు బియ్యాన్నే భోజనం తయారీకి వాడతారు. అన్నంలో కలుపుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చి మిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు, సెలయేర్లు, సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు.


ఎండ తీవ్రతకు చెట్ల కింద సేదతీరుతున్న ఆదివాసీలు

రాత్రి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలతో సందడి చేసి నిద్ర పోవడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి కూలి పనులు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బులు, మిరపకాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి సొంత గ్రామాలకు పయనమవుతారు. ఇలా వలస కూలీలనే నమ్ముకుని    ఇక్కడి రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం స్థానిక పల్లెల్లో సందడిగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి.


కాలువల్లో చెలమ నీటిని తాగుతున్న చిన్నారులు

వాగులు వంకల్లోనే నివాసం
కూలీ పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగులు, గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను కలిసి వండుకుంటారు. సూర్యుడు ఉదయించక ముందే మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి.. ఆ వెంటనే మరలా పనులకు ఉపక్రమిస్తారు. సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు క్యూ పద్ధతిలో వెళ్లిపోతారు.

పని విరామంలో వారికి వారే క్షవరం చేసుకుంటున్న దృశ్యం


 

మరిన్ని వార్తలు