ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పరిపాలనా అనుమతి

17 Jun, 2022 11:48 IST|Sakshi

కాలువల పనులు ఇప్పటికే ప్రారంభం 

త్వరలో ప్రధాన కాలువ, 3 రిజర్వాయర్లు,సబ్‌ లిఫ్ట్‌ల పనులకు టెండర్లు

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకించి సుభిక్షం చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు రూ.17,050.20 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తొలిదశ పనుల అంచనా వ్యయం రూ.2,022.20 కోట్లు కాగా  రెండో దశ పనుల అంచనా వ్యయం రూ.15,028 కోట్లు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.

ప్రాజెక్టు కోసం 63.20 టీఎంసీల గోదావరి నికర జలాలను కేటాయించడం గమనార్హం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి, రెండో దశలో 63.99 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 3.98 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. ప్రధాన కాలువలో మిగిలిన పనులతోపాటు భూదేవి రిజర్వాయర్‌ (6.55 టీఎంసీలు), వీరనారాయణపురం రిజర్వాయర్‌ (6.2 టీఎంసీలు), తాటిపూడి రిజర్వాయర్‌ (3.8 టీంసీలు) నిర్మాణం, సబ్‌ లిఫ్ట్‌ల పనులను చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరుల శాఖను ఆదేశించారు. ఆ పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా పూర్తి చేసేలా అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దిక్సూచిలా నిలుస్తుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి... 
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించాలనే ముందుచూపుతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం నుంచి రోజుకు 17,561 క్యూసెక్కులు (1.51 టీఎంసీలు) తరలించేలా పోలవరం ఎడమ కాలువను చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తూనే 162.409 కి.మీ. నుంచి రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినా ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచి్చన పాలకులు చంద్రబాబుతో సహా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా చేపట్టారు. 

డిస్టిబ్యూటరీల పనులు ప్రారంభం 
పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో భాగంగా 3.15 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, 13.5 కి.మీ. పొడవున లీడింగ్‌ కెనాల్‌తోపాటు జామద్దులపాలెం, తీడ వద్ద రెండు లిఫ్ట్‌లు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్‌ నిర్మాణం, 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్టిబ్యూటరీల ఏర్పాటు పనులను ప్రారంభించారు.

రెండో దశలో 20.05 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, పాపయ్యపాలెం లిఫ్ట్‌తోపాటు 63.995 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 2.68 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ఇప్పటికే ప్రారంభించారు. 

మిగిలిన పనులు వేగవంతం..
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశలో మిగిలిన పనులు అంటే.. ప్రధాన కాలువలో మిగిలిన 37.585 కి.మీ. పొడవున తవ్వకం, ప్రధాన కాలువకు అనుబంధంగా 6.20 కి.మీ. వద్ద భూదేవి(అనకాపల్లి జిల్లా), 50 కి.మీ. వద్ద వీరనారాయణపురం(విజయనగరం జిల్లా), 69.10 కి.మీ. వద్ద తాటిపూడి(విజయనగరం జిల్లా) రిజర్వాయర్‌ల నిర్మాణం– వాటికి అనుబంధంగా ఎత్తిపోతలు, కొండగండేరు లిఫ్ట్, బూర్జువలస లిఫ్ట్, జి.మర్రివలస లిఫ్ట్, 4.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక వైపు భూసేకరణ చేస్తూనే మరోవైపు పనులు చేపట్టడం ద్వారా వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.   

మరిన్ని వార్తలు