48 ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల అనుమతులు రద్దు

4 Nov, 2020 04:12 IST|Sakshi

61 కాలేజీల్లో వివిధ ప్రోగ్రామ్‌ల రద్దు

సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 48 ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు యూనివర్సిటీల అఫ్లియేషన్‌ లేకుండా కొనసాగుతుండటం, ఎలాంటి ప్రవేశాలు లేకుండానే నిర్వహిస్తుండటం, ప్రవేశాలు చేపట్టినా చేరికలు 25% కన్నా తక్కువగా ఉండటం వంటి కారణాలతో 246 ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది.

వీటిపై విచారణ కమిటీని నియమించిన మండలి ఆ షోకాజ్‌ నోటీసులకు నిర్ణీత డాక్యుమెంట్లతో కమిటీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కొన్ని కాలేజీలు కమిటీ ముందు హాజరై సమాధానాన్ని తెలియజేయగా, మరికొన్ని విచారణకు హాజరుకాలేదు. కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల అనుమతులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు 61 డిగ్రీ కాలేజీల్లోని కొన్ని ప్రోగ్రామ్‌లను ఉన్నత విద్యామండలి ఉపసంహరించింది.  

మరిన్ని వార్తలు