కోవిడ్‌ దోసెలు వేయడం నేర్పింది: ఆదోని ఎమ్మెల్యే

9 Aug, 2020 08:53 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ఉదయం టిఫిన్‌లో దోసెకు ప్రత్యేక స్థానం ఉంది. హోటళ్లలో పలు రుచుల్లో లభించే దోసెలకు ఎన్నో పేర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఆనియన్‌ దోసె మొదలు చైనీస్, ఆమెరికా, కోన్, 70 ఎం.ఎం, ఎమ్మెల్యే దోసె ఇలా.. ఎన్నో వెరైటీల్లో లభిస్తుంది. ఎప్పుడైనా ఎమ్మెల్యే దోసె తిన్నారో లేదో గాని.. ఒక ఎమ్మెల్యేనే దోసె వేసిన సంగతి ఇది. కోవిడ్‌ నేపథ్యంలో ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇందుకు ప్రజా ప్రతినిధులు అతీతులు కాలేదు. ఎప్పుడూ వంట, వార్పు ఎరుగని ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్‌రెడ్డి కూడ గరిట పట్టాల్సి వచ్చింది. నియోజక వర్గం అభివృద్ధి పనుల విషయంపై ఆయన ఇటీవల అమరావతికి వెళ్లారు. అయితే కోవిడ్‌ 19 కారణంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఆయన వంట చేసుకోడానికి స్వయంగా గరిట చేపట్టారు. (‘వర్క్‌ ఫ్రం హోం’ కోసం తెగ సెర్చింగ్‌!)

ఉదయం దోసలు చేసుకుని, ఇందులోకి బంగాళ దుంపకూర వండారు. మధ్యాహ్నం వంట చేసుకున్నారు. ఈ విషయం తెలిసి వంట ఎప్పుడు నేర్చుకున్నారని ‘సాక్షి’ అడుగగా అవసరం అన్ని నేర్పుతుందంటూ చమత్కరించారు. కోవిడ్‌ పరిస్థితిలో హోటళ్లు మూత పడ్డాయని, రోడ్డు పక్కన చిన్న హోటళ్లలో అల్పాహారం, భోజనం ఎంత వరకు సురక్షితమో తెలియని పరిస్థితిలో వంట చేసుకోవడమే మేలని భావించి అమరావతిలో ఉన్నన్ని రోజులు వంట చేసుకుంటానని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు అవసరం అయిన జాగ్రతలు తీసుకోవాలని కోరారు. ఏమవుతుందిలే అని మొండిగా వెళ్లితే ఒక్కో సారి అదే ప్రమాదానికి చేరువ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.     

మరిన్ని వార్తలు