విజయవాడలో బరితెగించిన మాంసం మాఫియా

20 Nov, 2020 09:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ శివారు ప్రాంతాల నుంచి మృతిచెందిన కోళ్లు సరఫరా 

చనిపోయిన పశువుల మాంసం సేకరణ 

హోటళ్లు, రెస్టారెంట్లలోనూ విక్రయాలు 

వరుస దాడులతో వెలుగులోకి వస్తున్న వైనం

సాక్షి, అమరావతి బ్యూరో/పటమట: విజయవాడలో మాంసం మాఫియా బరితెగించింది. చనిపోయిన కోళ్లు.. చనిపోయిన మేకలు, గొర్రెల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నీట్‌గా డ్రెస్సింగ్‌ చేసి రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడమే కాకుండా ప్రతి ఆదివారం బహిరంగంగానే విక్రయిస్తున్నారు. కల్తీ మాంసం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నగరంలో వారానికి నాలుగు టన్నుల కల్తీ మాంసం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం.   (ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..)

నిబంధనలు ఇవి.. 
నిబంధనల మేరకు కబేళాలో మటన్, బీఫ్‌ విక్రయదారులు తప్పనిసరిగా సంబంధిత జంతు శరీరంపై వీఎంసీ స్టాంప్‌ వేయించుకుని విక్రయాలు చేయాలి. కానీ ఒక పశువు, మేక, గొర్రెలకు స్టాంప్‌ వేయించుకుని మిగిలిన వాటి మాంసం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులైతే అది కూడా పాటించడం లేదు. అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. 

రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసం 

  • ఈ నెల 4న బందరురోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో నిల్వ ఉన్న 400 కిలోల మాంసాన్ని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, వీఎంసీ వెటర్నరీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిజ్‌లో పురుగులు పట్టి ఉన్న మాంసంతోనే వివిధ రకాల మాంసం పదార్థాలను తయారు చేయడం ఇటీవల సంచలనం కలిగించింది.   

  • ఈ నెల 8న భవానీపురం గొల్లపాలెంగట్టు వద్ద జరిగిన దాడుల్లో నగరంలోని పేరుమోసిన హోటళ్లకు సరఫరా చేసే బల్క్‌ మాంసం విక్రయదారుల నుంచి 400 కిలోల మాంసాన్ని వీఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. ఈ దాడుల్లో చనిపోయిన మేక మాంసం నుంచి పురుగులు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తుప్పు పట్టిన ఫ్రీజర్‌లో మాంసం ఉంచడం వల్ల్ల ఆ తుప్పు మాంసంలోకి చేరి వాటిని తిన్నవారు అనారోగ్యం పాలవుతారని అధికారులు చెబుతున్నారు.    

  •  అక్టోబర్‌ 3న రైల్వే పార్సిల్‌ కౌంటర్‌లో భువనేశ్వర్‌ నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్న 100 మేక తలకాయలను అధికారులు సీజ్‌ చేశారు.  

  • ఈ నెల 10న రామలింగేశ్వర నగర్‌లోని ఫిష్‌ మార్కెట్‌లో 100 కిలోల నిల్వ ఉన్న చేపలను విక్రయిస్తుండగా అడ్డుకున్నారు.  
     
  • ఈ నెల 15న కరెన్సీ నగర్, రామచంద్ర నగర్‌లో మటన్‌లో బీఫ్‌ కలిపి విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారుల నుంచి మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.  
మరిన్ని వార్తలు