ముందస్తు చర్యలు..మస్తుగా ఇసుక నిల్వలు

28 Oct, 2022 16:18 IST|Sakshi

అందుబాటులో ఇసుక

రెండు జిల్లాల్లోని 19 డిపోల్లో తగినంత ఇసుక

84,873 మెట్రిక్‌ టన్నులు సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం 

సాక్షి ప్రతినిధి, కడప : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదులు పొంగి పొర్లాయి. దీంతో ఇసుక రీచ్‌లు దాదాపు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా డిపోల్లో లక్షలాది మెట్రిక్‌ టన్నుల ఇసుకను సిద్ధంగా ఉంచడంతో ప్రస్తుతానికి కొరత లేకుండా పోయింది. అవసరమైన వినియోగదారులకు ఇసుక డిపోల నుంచే తరలిస్తున్నారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టిన వెంటనే అన్ని రీచ్‌ల ద్వారా 12,98,835 క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది.  
∙ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వైఎస్సార్‌ జిల్లాలో పెన్నా, చిత్రావతి, కుందూ, పాపాఘ్ని నదులు పొంగి ప్రవహించాయి. వీటి పరిధిలో జిల్లాలో 18 ఇసుక రీచ్‌లు ఉండగా, వరద ప్రభావంతో ప్రస్తుతం 15 మూతపడ్డాయి. జిల్లాలోని వెంకాయ కాలువ, ఏటూరు, గడ్డంవారిపల్లె రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. మొత్తం 18 రీచ్‌ల పరిధిలో 88.722 హెక్టార్ల పరిధిలో 8,43,765 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉండేది.

అయితే ఈ రీచ్‌లు మూతపడడంతో ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వం ముందస్తు చర్యగా జిల్లాలోని బద్వేలు, చిన్నచౌకు, పోరుమామిళ్ల, మైదుకూరు, పగడాలపల్లె, కమలాపురం, నందిపల్లె, పులివెందుల, కె.వెంకటాపురం, పి.అనంతపురం, నంగనూరుపల్లె డిపోలలో 5,07,476 మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచింది. 

అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు, బాహుదా, మాండవ్యలు పొంగి ప్రవహించాయి. దీంతో ఆ జిల్లా పరిధిలోని 13 ఇసుక రీచ్‌ల్లో 11 మూతపడ్డాయి. కేవలం మందరం, గంగిరెడ్డిపల్లె రీచ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. మొత్తం 13 రీచ్‌ల పరిధిలో 53.427 హెక్టార్లలోని రీచ్‌ల ద్వారా 4,55,070 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉండేది. అయితే రీచ్‌లు మూతపడడంతో ప్రస్తుతం అక్కడి నుంచి ఇసుక తరలించడం నిలిచిపోయింది.జిల్లాలోని మంగంపేట, వెంకటరాజుపేట, రాయచోటి, మందపల్లె, టంగుటూరు, పీలేరు ఇసుక డిపోల పరిధిలో 1,77,395 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. 

నదుల్లో నీరు తగ్గాక రీచ్‌లను పునరుద్ధరిస్తాం 
వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదుల్లో నీరు పారుతుండడంతో 90 శాతానికి పైగా ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. అయితే వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 19 ఇసుక డిపోల పరిధిలో ప్రస్తుతం 6,84,873 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇసుక అందుబాటులో లేదన్న ఫిర్యాదులు మాకు లేవు. నదుల్లో నీరు తగ్గిన వెంటనే రీచ్‌లను పునరుద్ధరిస్తాం.     
– పి.వెంకటేశ్వరరెడ్డి,   డిప్యూటీ డైరెక్టర్, భూగర్భగనులశాఖ, కడప   

రెండు జిల్లాల పరిధిలో ప్రస్తుతం 19 ఇసుక డిపోల్లో 6,84,873 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. దీంతో అవసరమైన వినియోగదారులకు డిపోల నుంచి ప్రభుత్వం ఇసుకను తరలిస్తోంది. వరద ప్రవాహం తగ్గిన వెంటనే రెండు జిల్లాల్లోని 31 రీచ్‌ల పరిధిలో 142.149 హెక్టార్లలో 12,98,835 క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. 

మరిన్ని వార్తలు