రీ సర్వే కోసం ఆధునిక శిక్షణ

14 Jul, 2022 04:03 IST|Sakshi
డ్రోన్‌ పైలట్‌ సర్వే పై శిక్షణ ఇస్తున్న దృశ్యం

94 మందికి డ్రోన్‌ పైలట్, డ్రోన్‌ డెస్టినేషన్‌ సర్వేలపై శిక్షణ

వీరి ద్వారా మండలానికి ఒకరు చొప్పున 679 మందికి.. 

వీరందరి ద్వారా విజయవంతంగా సాగుతున్న భూముల రీ సర్వే  

సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక శిక్షణ అందిస్తోంది. ఏపీ సర్వే అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే సెటిల్‌మెంట్‌ శాఖలో పనిచేస్తున్న 94 మందిని ఎంపిక చేసి డ్రోన్‌ పైలట్‌ సర్వే, డ్రోన్‌ డెస్టినేషన్‌ సర్వేల్లో ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ అందించింది. గురుగాం సంస్థ ద్వారా 35 మందికి, ట్రినిటీ సంస్థతో 53 మందికి, సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థతో ఆరుగురికి డ్రోన్‌ పైలట్‌ సర్వేలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తీసుకున్న వారిని 26 జిల్లాల్లో డ్రోన్‌ పైలట్, కో పైలట్‌లుగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే వీరి ద్వారా.. ఆయా జిల్లాల్లోని మండలాల వారీగా పలువురిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించారు.

రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లో ఒక్కో ట్రైనర్‌ ఉండేలా.. గ్రామ సర్వేయర్లలో 679 మందిని ఎంపిక చేశారు. క్యూ–జీఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్, గ్రామ మ్యాప్‌లు రూపొందించే వీరికి మాస్టర్‌ ట్రైనర్లుగా శిక్షణ అందించారు. ఆయా మండలాల్లోని మిగిలిన సర్వేయర్లకు కూడా డ్రోన్‌ పైలట్, డెస్టినేషన్‌ సర్వేలపై వీరు శిక్షణ ఇస్తున్నారు. వీరందరి ద్వారా ప్రస్తుతం డ్రోన్‌ సర్వే వేగంగా, విజయవంతంగా జరుగుతోంది. అలాగే రీ సర్వేలో కీలకమైన గ్రౌండ్‌ ట్రూతింగ్‌(క్షేత్ర స్థాయి నిజనిర్ధారణ), గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌కు ప్రతి మండలంలో ఒక ట్రైనర్‌ అందుబాటులో ఉండేలా శిక్షణ పూర్తి చేశారు. ఇదే శిక్షణను అఖిల భారత స్థాయి అధికారుల నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల వరకూ ఇస్తున్నారు. 

నల్సార్‌ వర్సిటీతో మొబైల్‌ మెజిస్ట్రేట్లకు.. 
రీ సర్వేలో వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్‌ మేజిస్ట్రేట్‌ వ్యవస్థలో పనిచేసే వారికి నల్సార్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. న్యాయపరమైన అంశాలను సమర్థంగా పరిష్కరించేలా డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లకు ఈ శిక్షణ అందించారు. 

అన్ని విధానాలపై విజయవంతంగా శిక్షణ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అవసరమయ్యేలా సాంప్రదాయ, ఆధునిక, క్షేత్ర స్థాయి ప్రత్యక్ష సర్వే విధానాలపై సర్వేయర్లకు విజయవంతంగా శిక్షణ ఇచ్చాం. దీని వల్లే రీ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. 
– సీహెచ్‌వీఎస్‌ఎన్‌ కుమార్, వైస్‌ ప్రిన్సిపాల్, ఏపీ సర్వే అకాడమీ  

మరిన్ని వార్తలు