ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదు

20 Jul, 2021 05:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నీలం సాహ్నిని నియమించడం వల్ల పిటిషనర్‌ వ్యక్తిగత హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సాహ్ని నియామకం వల్ల తనకు ఎలా వ్యక్తిగత నష్టం జరిగిందో, ఆమె నియామకం వల్ల ఏ రకంగా ప్రభావితం అయ్యారో ఎక్కడా చెప్పలేదని వివరిం చారు. వ్యక్తిగతంగా హక్కులు ప్రభావితం కానప్పుడు అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) అవుతుందని, పిల్‌ను ధర్మాసనమే విచారించాల్సి ఉం టుందన్నారు. అలాగే పిటిషనర్‌ కో–వారెంటో ఉత్తర్వులు కోరుతున్నారని, కో–వారెంటో పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు దానిని ఎవరు విచారించాలన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) నిర్ణయిస్తారని తెలిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్‌రావు స్పందిస్తూ..  నీలం సాహ్ని నియామకం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని, అందువల్లే ఓ పౌరుడిగా సవాల్‌ చేశారని చెప్పారు.  హెకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో–వారెంటో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్‌జీ) చింతల సుమన్‌ గత విచారణ సమయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుల నియామక విధానం, వారి విధులు, బాధ్యతలు తదితరాలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 

మరిన్ని వార్తలు