జిల్లాలో చర్చనీయాంశంగా బ్రాస్‌లైట్‌ వ్యవహారం

19 Oct, 2020 07:11 IST|Sakshi

మహిళా సీఓకు కానుకగా బంగారు బ్రాస్‌లెట్‌ సమర్పించిన ఆర్‌పీలు  

బ్రాస్‌లెట్‌ చేయించేందుకు పొదుపు సంఘాల మహిళల నుంచి వసూళ్లు 

వ్యవహారం బయటకు రావడంతో డబ్బులు వెనక్కి ఇచ్చిన సీఓ 

సాక్షి, ప్రకాశం: కందుకూరు మెప్మాలో ఓ బంగారు బ్రాస్‌లెట్‌ వ్యవహారం తీవ్ర చర్చగా మారింది. పొదుపు సంఘాల గ్రూపుల నిర్వహణలో జరుగుతున్న అవినీతి వ్యవహారానికి ప్రతీకగా ఈ బ్రాస్‌లెట్‌ కథ చర్చనీయాంశమైంది. ఓ మహిళా సీఓ మెప్పు కోసం ఆర్‌పీలు అంతా కలిసి సంఘాల నుంచి డబ్బులు వసూలు చేయడం... ఆ డబ్బులతో అమ్మగారికి బ్రాస్‌లెట్‌ చేయించడం, ఇది కాస్త బయటకు వచ్చి వ్యవహారం రచ్చగా మారింది. దీంతో బ్రాస్‌లెట్‌ డబ్బులను సదరు సీఓ తిరిగి ఆర్‌పీలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. మెప్మాలో జరుగుతున్న అవినీతి, మహిళల నుంచి డబ్బుల వసూలు  కార్యక్రమానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే.  

అసలేం జరిగింది..? 
పట్టణ మెప్మా విభాగంలో పనిచేసే ఓ మహిళా సీఓ అవినీతి వ్యవహారానికి ఈ బ్రాస్‌లెట్‌ వ్యవహారం ఓ ఉదాహరణ. ఇటీవల కాలంలో ఆమె ఇంట్లో ఓ వేడుక జరిగింది. ఈ వేడకకు ఆమెకు విలువైన కానుక ఇవ్వాలని రిసోర్స్‌ పర్సన్స్‌(ఆర్‌పీలు) నిర్ణయించారు. దీనికి గాను వారి పరిధిలోని ప్రతి సంఘం నుంచి కొత్త మొత్తాన్ని వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన డబ్బులతో సదరు సీఓకు కానుక ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో విలువైన బంగారు బ్రాస్‌లెట్‌ను చేయించారు. వేడుక రోజు బ్రాస్‌లెట్‌ను సదరు సీఓకి అందజేశారు. ఈ వ్యవహారం కాస్త రచ్చగా మారింది. విషయం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి దాకా చేరింది. దీంతో ఆయన ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ఇప్పుడు మెప్మాలో పెద్ద చర్చనీయాశంగా మారింది.

వెంటనే అప్రమత్తమైన సదరు సీఓ బ్రాస్‌లెట్‌ కోసం చేసిన ఖర్చు మొత్తాన్ని ఆర్‌పీలకు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. దీంతో అసలు మొత్తం ఈ వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారనే దానిపై ఇటు సీఓ, అటు ఆర్‌పీల్లో చర్చగా మారింది. అయితే మెప్మాలో ఈ వ్యవహారం కొత్తేమి కాదు, రుణాలు ఇప్పించాలన్నా, ప్రభుత్వం ఏమైనా పథకాలు వచ్చినా ప్రతి సంఘం నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. గత ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ తరుపున ఆర్‌పీలు జోరుగా ఓటర్లకు డబ్బులు పంచారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో పట్టణ మెప్మాలో జరుగుతున్న అవినీతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

విషయం నా దృష్టికి వచ్చింది.. విచారణ చేయిస్తా..
కందుకూరు మెప్మాలో బ్రాస్‌లెట్‌ వ్యవహారం నా దృష్టికి వచ్చింది. అలాగే డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై త్వరలోనే విచారణ చేయిస్తాను. ఇలా డబ్బులు వసూలు చేయడం అనేది నిజంగా క్షమించరాని విషయమే. ఈ వ్యవహారాలపై త్వరలోనే విచారణ జరుపుతాం, కందుకూరులో సమావేశాలు నిర్వహించి మెప్మా సిబ్బందిలో మార్పు తీసుకుచ్చేందుకు కృషి చేస్తాను. -రఘు, మెప్మా ఇన్‌చార్జి పీడీ 

కమీషన్‌ వ్యాపారం.. 
ఇటీవల కాలంలో పొదుపు సంఘాల మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, జగనన్న తోడు వంటి పథకాలను అమలు చేస్తుంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకాల్లో వైఎస్సార్‌ ఆసరా కింద డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తుండగా, చేయూత పథకం కింద రూ.18,750లను ఆర్థిక సాయం అందిస్తుంది. జగనన్నతోడు పథకం కింద చిరువ్యాపారులకు రూ.10వేల రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకాల్లో ఆసరా, జగనన్నతోడు పథకాలతో సీఓలు, ఆర్‌పీలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ క్రమంలో పొదుపు సంఘాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే సీసీల వ్యవహారశైలిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఇది ఒక్క కేవలం మెప్మాకి మాత్రమే పరిమితం కాదు, వెలుగు విభాగంలో మండలాల్లో పనిచేసే సీసీలది ఇదే పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు కందుకూరు, ఉలవపాడు వంటి ప్రాంతాల్లో వెలుగులోనికి వచ్చాయి. వీటిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు రూరల్‌ ప్రాంతంలో కూడా సంఘానికి రూ.1000 చొప్పున ఇవ్వాలని బేరంపెట్టినట్లు సమాచారం. ఇలా అధికారులే నేరుగా పొదుపు సంఘాలతో కమీషన్‌ వ్యాపారం చేస్తున్నట్లు తయారైంది పరిస్థితి. డబ్బులు అడిగే సీసీల సమాచారం ఇవ్వాలని, తమకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రచారం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు రావడం లేదు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా