కరువు నేలలో జలధారలు

20 Sep, 2022 10:45 IST|Sakshi

నీటి జాడలు లేక భూములు బీడు బారాయి. గుక్కెడు నీరు దొరక్క గ్రామాలకు గ్రామాలే వలసపోయాయి. దశాబ్దాలుగా కరువు కోరల్లో విలవిల్లాడిన నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. నెర్రెలు బారిన భూములు సస్యశ్యామలం కానున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో జలసిరులు నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేసిన ప్రయత్నాలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్‌ టెయిల్‌ఎండ్‌ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందు కోసం రూ.84.25 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రత్యేక జీఓ విడుదల జేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  కరువు నేలపై జల పరవళ్లు చూడాలని అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంతో శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌లు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాకు ప్రధాన జలవనరుగా మారనున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధుల వరద పారించారు. వెలిగొండతో పాటు రామతీర్థం, గుండ్లకమ్మ, కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం.. ఇలా కరువు సీమలో కృష్ణమ్మను పరుగులు తీయించారు. ఇప్పడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు చివరి భూములుగా ఉన్న తీగలేరు కాలువ టీ–5 పరిధిని పెంచి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించారు. పుల్లలచెరువు మండలంలోని 9 గ్రామాలను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ నంబర్‌ 1824ను 2022 ఆగస్టు 17న విడుదల చేసింది. జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ. 84.25 కోట్లు మంజూరు చేసింది.  తీగలేరు కాలువ అభివృద్ధి కోసం టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. తీగలేరును అభివృద్ధి చేయడం ద్వారా పుల్లలచెరువు మండలంలో తాగు, సాగు నీరు అవసరాలు పూర్తిగా తీరనున్నాయి.  

చిన కండలేరు ప్రాజెక్టుకు అనుసంధానం: 
తీగలేరు బ్రాంచ్‌ కాలువను అభివృద్ధి చేయటం ద్వారా ఆ కాలువ ద్వారా ప్రవహింపజేసే నీటితో పుల్లలచెరువు మండలంలోని చినకండలేరు జలాశయాన్ని అనుసంధానం చేయనున్నారు. దశాబ్దాల తరబడి తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న పుల్లలచెరువు మండల ప్రజల కష్టాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుక్కెడు నీటి కోసం వలసలు వెళ్లే  గ్రామాల ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించాలని సీఎంను కోరారు. దశాబ్దాలుగా కరువుతో బీడు భూములుగా మారుతున్న గ్రామాల రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి, సాగు నీటి అవసరాలు తీరాలంటే ఒక్క వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిధిని పెంచితేనే సాధ్యమని సీఎంకు వివరించారు. దీంతో ప్రత్యేక జీఓ ద్వారా నిధులు విడుదల చేశారు. 

11,500 ఎకరాలు సస్యశ్యామలం:  
పుల్లలచెరువు మండలానికి కృష్ణా జలాలను తీసుకురావడంతో 9 గ్రామాల్లోని దాదాపు 11,500 ఎకరాలకు పైగా బీడువారిన భూములు వివిధ రకాల పంటలతో కళకళలాడనున్నాయి. ఇప్పటి వరకు వెలిగొండ ప్రాజెక్టు టెయిల్‌ఎండ్‌ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకురావడంతో మండల ప్రజల ఆశలు చిగురించాయి. కరువు నేలలో బీడు భూములను పంట పొలాలుగా మార్చటంతో పాటు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల జీవితాల్లో వెలుగులు 
మా ప్రాంతంలో తాగు, సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. టి–5 కాలువ పనులు పూర్తిచేసి చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే మా ప్రాంతాల్లోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారు. ఏళ్ల తరబడి నీరులేక ఇబ్బందులు పడుతున్నాం. సాగునీరు లేక, పంటలు పండక కరువుతో అల్లాడుతున్నాం. ప్రభుత్వం తీగలేరు కాలువ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయటంతో ఇక్కడి ప్రజలకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. 
– శివారెడ్డి, రైతు, మల్లాపాలెం  

కోనసీమను తలపిస్తాయి..  
తీగలేరు కాలువ పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. స్థానిక ప్రజల కష్టాలను గుర్తించి సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురే‹Ùకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టి–5 కాలువ ద్వారా చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే ఈ ప్రాంత పొలాలు కోనసీమను తలపిస్తాయి. నీరు వృథా కాకుండా పంటలను సాగు చేసుకుంటాం.   
– నాసరయ్య, రైతు, పుల్లలచెరువు

మరిన్ని వార్తలు