‘ఎఫ్‌ఐఆర్‌లను 24 గంటల్లోనే అప్‌లోడ్‌ చేస్తున్నాం’

20 Jul, 2021 04:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్‌ను పోలీసు శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ నివేదించారు. పోలీస్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి ఇప్పటి వరకు 94,650 ఎఫ్‌ఐఆర్‌లు, యాప్‌ నుంచి 5.5 లక్షల ఎఫ్‌ఐఆర్‌లను డౌన్‌లోడ్‌ చేశారని వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

మీడియాకు సంబందించిన వ్యక్తులతో పాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎఫ్‌ఐఆర్‌ను 24 గంటల్లో అప్‌లోడ్‌ చేయడం లేదంటూ టీవీ 5 న్యూస్‌ చానల్‌ యజమాని బొల్లినేని రాజగోపాల్‌నాయుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్‌ అప్‌లోడ్‌ చేస్తున్నామని.. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుం టున్నామని చెప్పారు.  ధర్మాసనం స్పందిస్తూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోకుం టే కోర్టు ధిక్కారం కింద నోటీసులిచ్చే అధికారం తమకు ఉందని పేర్కొంది. 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్‌లు అప్‌లోడ్‌ చేయడం వల్ల నిందితుల హక్కులను పరిరక్షించినట్లు అవుతుందని తెలిపింది.  

మరిన్ని వార్తలు