AP: ఖరీఫ్‌కు పుష్కలంగా ఎరువులు

22 Jul, 2021 07:29 IST|Sakshi

‘వ్యవసాయ’ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్‌ పంటల సాగుకు 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. రాష్ట్రంలో 6.66 లక్షల టన్నులు ఎరువుల నిల్వలు ఉన్నాయన్నారు. జూలై నాటికి మరో 6.86 లక్షల టన్నులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 4.30 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా.. ఇంకా 8.87లక్షల టన్నుల ఎరువులు, 0.23 లక్షల టన్నుల అమ్మోనియం, సల్ఫేట్‌ నిల్వలు ఉన్నాయని వివరించారు.

జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి మరో 1.56 లక్షల టన్నుల యూరియా, 0.63 లక్షల టన్నుల డీఏపీ, 1.20 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.26 లక్షల టన్నుల ఎంవోపీ కేటాయించారని తెలిపారు. వాటిని రాష్ట్రానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1.53 లక్షల టన్నుల ఎరువులను మార్క్‌ఫెడ్‌ గోడౌన్లలో నిల్వ చేశామని, ఆర్‌బీకేల్లో 82 వేల టన్నులు రైతులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి.. రాష్ట్రానికి, జిల్లాలకు రావాల్సిన ఎరువులను రప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డీలర్లు ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే స్థానిక వ్యవసాయాధికారికి గాని, సమీకృత రైతు సమాచార కేంద్రం టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251కు గాని ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు