వ్యవసాయం పండుగే.. రైతు ముంగిటకే పథకాలు

8 Jul, 2021 13:09 IST|Sakshi

రైతుల ఇంట.. సిరుల పంట

వ్యవసాయ, ఆక్వా రంగాల అభివృద్ధి

రైతు భరోసా, పంటల బీమాతో తోడ్పాటు 

జగన్‌ రెండేళ్ల పాలనపై కర్షకుల హర్షం

నేడు రైతు దినోత్సవం 

ఆకివీడు: ‘పల్లెటూరు మన భాగ్య సీమరా, పాడిపంటలకు లోటు లేదురా’ అన్న కవి మాటలను నిజం చేసేలా రాష్ట్రంలో సీఎం జగన్‌ పాలన సాగుతోంది. పల్లె ప్రగతికి పట్టం కడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పథకాలను అమలుచేస్తుండటంతో అన్నదాతలు ఆనందంగా జీవనం గడుపుతున్నారు. రెండేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. వీటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. జిల్లాలో 5.85 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంది. సుమారు 80 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. ఆరు వేల ఎకరాల్లో కూరగాయాల పంటలు పండిస్తున్నారు. పాడి రైతులకు అదనపు ఆదా యం లక్ష్యంగా అమూల్‌ పాల సేకరణ కేంద్రాలను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద మహిళా రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. పశువుల పెంపకం, పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది.  

రైతు ముంగిటకే పథకాలు 
ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా, పంటల బీమా, సున్నావడ్డీ రుణాలు అందిస్తూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతోంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతుల చెంతకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ–క్రాపింగ్‌ విధానంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు పంటల బీమా వర్తింపజేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానించి మద్దతు ధరలు అందిస్తున్నారు. దళారుల బెడద లేకుండా కళ్లాల్లోనే ధాన్యాన్ని అమ్ముకునేలా ఏర్పాట్లు చేశారు. కౌలువ్యవస్థను కూడా పటిష్ట పరిచేలా  కౌలుచట్టంలో మార్పులు తీసుకువచ్చారు. భూమి యజమానికి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కౌలు వ్యవస్థ పటిష్టపడింది. 

మీసం మెలేస్తున్న రొయ్య 
రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు అభివృద్ధి చేసేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారు. కోవిడ్‌ విపత్తులోనూ ధరలో లాబీయింగ్‌ను అరికట్టి మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు చేయించారు. ఆక్వా చెరువులకు తక్కువ ధరకు విద్యుత్‌ సరఫరా, ఈ మార్కెట్‌ సదు పాయం, ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు, నాణ్యమైన సీడు, ఫీడు, మందులు అందించేలా చర్యలు తీసుకున్నా రు. ఆక్వాజోన్లతో త్వరితగతిన ఆక్వా అనుమతులు లభిస్తున్నాయి. చేపలు, రొయ్యలకు మార్కెట్‌ కల్పించేలా ఈ–వెహికల్స్‌ ఏర్పాటుచేయనున్నారు.

ఈనెల 9 నుంచి చైతన్య యాత్రలు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీ నుంచి రైతు చైతన్య యాత్రలను నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించింది. వ్యవసాయశాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రాప్, రైతు భరోసా కేంద్రం విధివిధానాలు, పంటల బీమా, వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతుల్లో అవగాహన పెంచేలా చైతన్య యాత్రలను నిర్వహించనున్నారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు