ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

13 Sep, 2021 03:07 IST|Sakshi
అగ్రిగోల్డ్‌ బాధితుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

13 జిల్లాల అగ్రిగోల్డ్‌ బాధితుల కృతజ్ఞతలు

మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని విన్నపం

గత సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన

సాక్షి, అమరావతి: అమాయక ప్రజలను అగ్రిగోల్డ్‌ సంస్థ మోసం చేస్తే, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు అండగా నిలిచి ఆదుకున్నారని అగ్రిగోల్డ్‌ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల అగ్రిగోల్డ్‌ బాధితులు ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అగ్రిగోల్డ్‌ బాధితులు, సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి ప్రభుత్వం తరఫున రూ.905 కోట్ల మేర సహాయం అందించిన సీఎం.. చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అగ్రిగోల్డ్‌ సంస్థ ద్వారా దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో లక్షలాది మంది నష్టపోయారన్నారు.

ఆరేళ్ల క్రితం సంస్థను మూసి వేయడంతో డబ్బు కోసం రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేశామన్నారు. సంస్థ ఆస్తులు విక్రయించడం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చని గత ప్రభుత్వ హయాంలో కింది స్థాయి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వరకూ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు అందించినా పట్టించుకోలేదని చెప్పారు. పోలీసులతో లాఠీచార్జ్‌లు చేయించి, కేసులు పెట్టి, జైళ్ల పాలు చేశారని వాపోయారు. ఆ సమయంలో పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు, అగ్రిగోల్డ్‌ బాధిత బాసట కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన 10.40 లక్షల మందికి రూ.905 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయ, సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి వినతిపత్రం అందచేశారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘ నాయకులు రత్నాచారి, మోజెస్, జడ్‌ సన్, రాము, నవరత్నాల ప్రోగ్రామ్‌ వైస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు