ఇక.. రోబో సేద్యం

27 Feb, 2023 03:52 IST|Sakshi
ఎక్స్‌ –100 రోబో తో వ్యవసాయ పనులు చేస్తున్న దృశ్యాలు

పొడి నేలల్లో పంటల సాగుకు సాయం 

మిరప, పత్తి, పొగాకు, టమాటా, కూరగాయల పంటలకు అనుకూలం  

పొలం మ్యాప్, చేయాల్సినపని చెబితే చాలు.. అంతా ఆటోమేటిక్‌ 

3 గంటలు రీచార్జ్‌ చేస్తే 8 గంటలు పనిచేస్తుంది 

రోజుకు 2 ఎకరాల్లో స్ప్రేయింగ్, 4 ఎకరాల్లో మిగిలిన పనులు  

30–40 శాతం తగ్గనున్న పెట్టుబడి ఖర్చు  

రిమోట్‌ కంట్రోల్, ఏఐతో ఎక్స్‌–100 రోబో పనులు 

ఖరీఫ్‌ కల్లా అద్దె ప్రాతిపదికన రైతుల చెంతకు తేనున్న ఎక్స్‌మెషిన్స్‌ సంస్థ  

దుక్కి నుంచి కలుపుతీత వరకు 
మొక్కల వరుసల మధ్య రెండడుగుల దూరం ఉండే పంటలకు ఈ రోబో ఉపయోగం. డ్రై ల్యాండ్‌లో సాగయ్యే పత్తి, మిరప, పొగాకు, టమాటా, కూరగాయలు వంటి పంటల సాగులో దుక్కిదున్నటం, భూమి చదునుచేయడం, మొక్కలు నాటడం, విత్తడం, కలుపుతీయడం, ఎరువులు చల్లడం, పురుగుమందు పిచికారీ వంటి పనులన్నీ చేయగలదు. కావల్సిన విత్తనం, ఎరువులు, పురుగుమందులు రోబోకి అమర్చిన బాక్సులో వేసి రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేసుకోవచ్చు. పొలం మ్యాప్‌తో మొక్కల మధ్య, వరుసల మధ్య ఎంతదూరం ఉండాలో సెట్‌చేస్తే అదే విత్తుతుంది. ఏ పనిచేయాలో సెట్‌చేసి చెబితే చాలు మానవసాయం లేకుండా చేసేస్తుంది. స్ప్రేయింగ్‌ పనులు మాత్రమే అయితే రోజుకు నాలుగెకరాల్లో, ఇతర పనులైతే రోజుకు రెండెకరాల్లో పూర్తిచేస్తుంది. పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ రోబోను వరంగల్‌తో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో వినియోగించారు. పెట్టుబడి ఖర్చులో 30–40 శాతం తగ్గినట్లు గుర్తించారు. 

సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. అధునాతన యంత్ర పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే డ్రోన్‌ స్ప్రేయర్లు రంగప్రవేశం చేయగా, తాజాగా రోబోలు కూడా సేద్యం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దుక్కుల నుంచి కలుపుతీత వరకు అన్ని పనులు చేసేలా హైదరాబాద్‌కు చెందిన ‘ఎక్స్‌మెషిన్స్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ వీటిని అభివృద్ధి చేసింది. ఏపీ, తెలంగాణల్లో ఎంపికచేసిన పంటలసాగులో ప్రయోగాత్మక వినియోగంలో ఇవి సక్సెస్‌ కావడంతో ఖరీఫ్‌ సీజన్‌ నుంచి పూర్తిస్థాయిలో  అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పంట ఏదైనా విత్తు నుంచి కోత వరకు ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయి. పెట్టుబడి ఖర్చులో 35–40 శాతం కూలీలకే ఖర్చవుతోంది. పైగా ప్రతి దశలోను కూలీలకొరత రైతులను వేధిస్తోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో రకాల యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. రోజురోజుకు పెరిగే పెట్రో ఉత్పత్తుల ధరల కారణంగా వీటి నిర్వహణ రైతులకు భారమవుతోంది. ఈ సమస్యలను అధిగమించే లక్ష్యంతో భిన్నంగా ఆలోచించి.. నాలుగేళ్లపాటు పరిశోధించి, పరిశీలించిన ఎక్స్‌మెషిన్స్‌ సంస్థ ఎక్స్‌–100 అనే వ్యవసాయ రోబోను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.  

80 కిలోల బరువున్న రోబో 
ఈ రోబోను మైక్రో ట్రాక్టర్‌గా సంబోధిస్తున్నారు. దీంట్లో 24 వాట్స్‌ సామర్థ్యంగల రెండు బ్యాటరీలు, మోటారు, కంప్యూటర్, కెమెరా, సెన్సార్లు ఉన్నాయి. చిన్న రబ్బర్‌ టైర్లు అమర్చారు. 50 సెంటీమీటర్ల, 40 సెంటీమీటర్ల వెడల్పు, 72 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ రోబో 80 కిలోల  బరువుంటుంది. ఇది 5–7 కిలోల విత్తనాలు, 25 లీటర్ల పురుగుమందులు, 25 కిలోల ఎరువులు మోయ గలిగే ఏర్పాట్లు చేశారు.

మూడుగంటలు చార్జింగ్‌ పెడితే ఎనిమిది గంటలు నిర్విరామంగా పనిచేస్తుంది. ఒక బ్యాటరీ డిశ్చార్చ్‌ అవగానే ఆటోమెటిక్‌గా మరో బ్యాటరీ సహాయంతో  పనిచేస్తుంది. రిమోట్‌ కంట్రోల్‌తో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ద్వారా మానవ సహాయం లేకుండా కూడా పనిచేస్తుంది. ఈ రోబో పనితీరును అధ్యయనం చేసిన తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ సాగులో వినియోగానికి ఇబ్బంది లేదని సర్టిఫై చేసింది.  

40 శాతం ఆదా అవుతుంది 
రోబోల రాకతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అన్ని రకాల పనులకు ఈ చిట్టి రోబో­లు అనుకూలంగా ఉన్నాయి. చాలా బాగా పనిచేస్తున్నాయి. కొనుగోలుకు ఆర్డర్‌ కూడా పెట్టాను. వీటి సహాయంతో వ్యవసాయ పనులు చేస్తే కనీసం 40 శాతం పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయి. 
– పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రైతునేస్తం ఫౌండర్, గుంటూరు 

ఖరీఫ్‌ కల్లా అందుబాటులోకి తెస్తాం 
కూలీల వెతలను తీర్చడంతోపాటు వ్యవసాయ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా వినీల్‌రెడ్డి, ధర్మతేజాలతో కలిసి ఈ రోబోను అభివృద్ధి చేశాం. నాలుగేళ్లపాటు అన్ని రకాల టెస్ట్‌లు పూర్తిచేసి మార్కెట్‌లోకి విడుదల చేశాం. దీని ధర రూ.1.75 లక్షలు. అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కల్లా ఏపీలో గుంటూరు, అనంతపురం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల రైతులకు అందుబాటు­లో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– డి.త్రివిక్రమ్, వ్యవసాయ రోబో సృష్టికర్త  

మరిన్ని వార్తలు