గన్నవరంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం

21 Feb, 2021 03:15 IST|Sakshi
స్తంభాన్ని ఢీకొట్టడంతో దెబ్బతిన్న విమానం రెక్క

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం 

రన్‌వేపై విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న విమానం కుడి రెక్క 

ప్రయాణికులంతా క్షేమం 

పైలట్‌ తప్పిదమే ప్రమాదానికి కారణం! 

విచారణకు ఆదేశించిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ 

సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ బోయింగ్‌–737 విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా శనివారం ఖతార్‌ రాజధాని దోహా నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం 64 మంది ప్రయాణికులతో విజయవాడ మీదుగా తిరుచిరాపల్లికి బయలుదేరింది. సాయంత్రం 4.49 గంటలకు విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన తరువాత రన్‌వే నుంచి ఆప్రాన్‌లోని పార్కింగ్‌ బేలోకి వెళ్తున్న సమయంలో విమానం కుడి రెక్క హైమాస్ట్‌ లైట్ల విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది.

ఆ స్తంభం కుప్పకూలి విమానానికి కూతవేటు దూరంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విమానం కుడివైపు రెక్కభాగం దెబ్బతింది. వెంటనే ఎయిర్‌పోర్ట్‌ అగ్నిమాపక, భద్రతా దళాలు విమానం దగ్గరకు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో విజయవాడ విమానాశ్రయంలో దిగే ప్రయాణికులు 19 మంది, తిరుచునాపల్లికి వెళ్లే ప్రయాణికులు 45 మంది ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. 


విమానాన్ని పరిశీలిస్తున్న ఎయిర్‌ పోర్టు సిబ్బంది  

మరో విమానంలో తరలింపు 
ప్రమాదానికి గురైన విమానంలోని ఏపీ ప్రయాణికులను ఇక్కడే దించేసి తిరుచిరాపల్లి వెళ్లాల్సిన వారిని మరో విమానంలో పంపే ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు చెప్పారు.  

పైలట్‌ తప్పిదమే కారణం! 
ప్రమాదానికి పైలట్‌ తప్పిదమే కారణం కావచ్చని విమానాశ్రయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా విమానం ల్యాండ్‌ అయ్యే సమయానికి వాతావరణం మబ్బులతో కూడి ఉండటం వల్ల రన్‌వే, ఆప్రాన్‌లపై విజిబిలిటీ అస్పష్టంగా ఉందని పైలట్‌ చెప్పినట్టు సమాచారం. ఘటనపై ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా విచారణకు ఆదేశించింది. విజయవాడ విమానాశ్రయ చరిత్రలో ఇది రెండో ప్రమాదం. 1980 ఆగస్టు 28న హన్స్‌ ఎయిర్‌కు చెందిన విక్కర్స్‌ విస్కౌంట్‌ వీటీ–డీజేసీ విమానం ల్యాండ్‌ అవుతుండగా మూడుసార్లు రన్‌వేను గుద్దుకోవడంతో నోస్‌వీల్‌ దెబ్బతింది. అప్పట్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  

కుదుపులొచ్చాయ్‌ 
ఖతార్‌ నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ఇక్కడికి వచ్చాను. విమానం రన్‌వే పైకి దిగిన తర్వాత లోపల కుదుపులు వచ్చాయి. ఉన్నట్టుండి విమానం ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. 
– రేష్మ, ప్రయాణికురాలు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా 

చదవండి:
అవమానించారు.. డబ్బులడిగారు: మను భాకర్‌
ఇక ఆర్టీసీలోనూ ఆఫర్లు

మరిన్ని వార్తలు