9 నుంచి గగన విహారం 

6 Oct, 2021 05:15 IST|Sakshi

విజయవాడలో ఈనెల 15 వరకు హెలీ టూరిజం 

దసరా సందర్భంగా హెలీ రైడ్స్‌ ఏర్పాటు 

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో టికెట్ల బుకింగ్‌కు అవకాశం 

సాక్షి, అమరావతి: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో హెలీ టూరిజం ఏర్పాటు చేస్తున్నారు. ఆకాశంలో విహరిస్తూ నగర అందాలు వీక్షించే అవకాశం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర పర్యాటకశాఖ, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ) సంయుక్తంగా హెలీ రైడ్స్‌ ఏర్పాటు చేశాయి. దసరా సందర్భంగా భక్తులు, పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో హెలీ టూరిజానికి మంచి ఆదరణ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున హెలిప్యాడ్‌ ఏర్పాటుకు వీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, కోటప్పకొండ, కొండపల్లి, కొండవీడుల్లో హెలీ టూరిజం నిర్వహించగా విజయవాడలో మొదటిసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. 

రెండు కేటగిరీల్లో ఫ్లై జాయ్‌ టికెట్‌లు
కృష్ణానది పైనుంచి విహరిస్తూ జలనిధి అందాలతో పాటు మబ్బుల మాటునుంచి ఇంద్రకీలాద్రి వైభవం, బెజవాడ నగర సోయగాలను వీక్షించేలా ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం హెలీ టూరిజంలో విశేష అనుభవం గడించిన తుంబై ఏవియేషన్‌ సంస్థ ఆరుగురు ప్రయాణించేందుకు వీలుండే సింగిల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌ను అందుబాటులోకి తేనుంది. రెండు కేటగిరీల్లో అందించే ఈ హెలీ రైడ్స్‌కు ప్రాథమికంగా టికెట్‌ రేట్లను నిర్ణయించారు. ఆకాశం నుంచి ఇంద్రకీలాద్రి మీదుగా ప్రకాశం బ్యారేజీ, నగర అందాలను వీక్షించేందుకు 6 నుంచి 7 నిమిషాల ప్రయాణానికి రూ.3,500 టిక్కెట్‌ ధరగా నిర్ణయించారు. దుర్గగుడి ఏరియల్‌ వ్యూ, నగరంలోని హిల్స్‌ అందాలను వీక్షించేందుకు 15 నిమిషాల ప్రయాణానికి టిక్కెట్‌ ధర రూ.6 వేలు వసూలు చేయనున్నారు. ఈ ఫ్లై జాయ్‌ని ప్రోత్సహించడానికి సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. టికెట్లు బుక్‌ చేసుకోవడానికి ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాల్లో ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల స్పందనను బట్టి టికెట్‌ ధర తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

టూరిజాన్ని ప్రోత్సహించేలా.. 
రాష్ట్రంలో టూరిజాన్ని విస్తరించి, మరింత ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నాం. ఈ క్రమంలోనే విజయవాడలో తొలిసారిగా హెలీ టూరిజాన్ని తీసుకొస్తున్నాం. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాం. ఏర్పాట్లపై కృష్ణాజిల్లా కలెక్టర్, వీఎంసీ కమిషనర్‌లతో చర్చించాం.           
– ఎస్‌.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ   

మరిన్ని వార్తలు