హైవేపై విమానాల ల్యాండింగ్‌ ట్రయల్‌ రన్‌ 

28 Dec, 2022 06:20 IST|Sakshi

బాపట్ల జిల్లా రేణింగవరం–కొరిశపాడు మధ్య 

4 కిలోమీటర్ల మేర రన్‌ వే ఏర్పాటు 

ఉదయం 11 గంటల సమయంలో దిగనున్న కార్గో, ఫైటర్‌ జెట్‌ విమానాలు 

జే.పంగులూరు: విజయవాడ–ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై గురువారం విమానాల ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా.. ఇప్పటికే జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో రన్‌వేలు నిర్మించారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం క్షేమంగా నేలపైకి దిగడానికి వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ–కలికివాయి, బాపట్ల జిల్లా రేణింగవరం–కొరిశపాడు మధ్య హైవే మీద రన్‌వేలు సిద్ధం చేస్తున్నారు. రేణింగవరం–కొరిశపాడు మధ్య 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన రన్‌వేపై గురువారం ఉదయం 11 గంటలకు కార్గో, ఫైటర్‌ జెట్‌ విమానాలు దిగనున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వైమానిక దళ సిబ్బంది విమానాలు దిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. ట్రయల్‌ రన్‌ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రన్‌వే కోసం తారు రోడ్డును నాలుగు కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి.. నాలుగు లేయర్లుగా సిమెంట్‌ రోడ్డు వేశారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్‌ తీగలను తొలగించారు.  

మరిన్ని వార్తలు