నగదు బదిలీతో రైతు చేతికే ‘అస్త్రం’

10 Sep, 2020 02:53 IST|Sakshi

సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం

నాణ్యమైన విద్యుత్తు సరఫరాను హక్కుగా నిలదీయవచ్చు 

డిస్కమ్‌లకూ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి 

బిల్లులు చెల్లించే రైతుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాయి 

మీటర్లతో లోడ్‌కు తగ్గట్లుగా ట్రాన్స్‌ఫార్మర్ల అప్‌గ్రెడేషన్‌

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను అమర్చడం వల్ల అంతిమంగా రైతులకే మేలు జరుగుతుందని, లో వోల్టేజీ ఇబ్బందులు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలకు తెరపడుతుందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పేర్కొన్నారు. సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతుందని, దీన్ని హక్కుగా నిలదీసే అవకాశం కూడా వ్యవసాయదారులకు లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి మరో 30 ఏళ్ల పాటు పూర్తి ఉచితంగా రోజూ 9 గంటలు పగటిపూట విద్యుత్తు అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. కేంద్ర సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీని అమలు చేసినా ఏ ఒక్క రైతుపైనా పైసా కూడా భారం పడనివ్వబోమన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

గత సర్కారు నిర్లక్ష్యంతో..
గత సర్కారు నిర్వాకాలతో 42 శాతం ఫీడర్లలో నాణ్యమైన విద్యుత్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఫీడర్లను బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తోంది. రబీ నాటికి çవంద శాతం ఫీడర్ల పరిధిలో పగటి పూటే 9 గంటల విద్యుత్తు అందచేస్తాం. 

రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాం..
నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల పంపిణీ సంస్థల(డిస్కమ్‌లు) చేతికి డబ్బులు అంది ఆర్థికంగా మనుగడ సాగించగలుగుతాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా డిస్కమ్‌లకు బకాయిలు 14 నెలల పాటు చెల్లించలేదు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక రూ.8.000 కోట్ల బకాయిలు చెల్లించడంతోపాటు బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తోంది. 

రైతు చేతిలో ‘అస్త్రం’
నగదు బదిలీ విధానంలో రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే సొమ్ము బిల్లుల చెల్లింపు కోసం డిస్కమ్‌లకు చేరుతుంది. దీనిద్వారా రైతు ఎంత బిల్లు చెల్లిస్తున్నాడో తెలుసుకుంటాడు. విద్యుత్తులో నాణ్యత లేకుంటే నిలదీయవచ్చు. అంటే ప్రభుత్వం రైతుల చేతిలో ఒక అస్త్రాన్ని పెడుతోంది. ఫలితంగా డిస్కమ్‌ల బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతుంది. 

10 వేల మెగావాట్లతో సోలార్‌ ప్లాంట్లు...
మీటర్లు బిగించడం లాంటి అవసరాలకు మూలధన వ్యయం తప్పదు. అయితే ఇది వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నం. రైతులకు 30 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలంటే ఇలాంటి చర్యలు తప్పవు. అందుకోసమే ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్తును అందుబాటులోకి తెస్తోంది.  

శ్రీకాకుళం నుంచి శ్రీకారం
► డిసెంబర్‌ నుంచి  నగదు బదిలీని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం.
► ఉచిత విద్యుత్తు వినియోగంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించరు.  ఎక్కువ కనెక్షన్లు ఉన్నా ఇబ్బంది లేదు.
► ప్రతీ కిలోవాట్‌కు రూ. 1,200 డెవలప్‌మెంట్‌ చార్జీలు, ప్రతీ హెచ్‌పీకి రూ. 40 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించి  అక్రమ కనెక్షన్లు క్రమ బద్ధీకరించుకోవచ్చు. అదనపు లోడ్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. 

మీటర్లతో మేలు ఇలా..
మీటర్లు అమర్చడం వల్ల రైతు ఎంత విద్యుత్తు వినియోగిస్తున్నారో తెలుసుకుని అందుకు తగినట్లుగా లోడ్‌ ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్‌ను అప్‌గ్రేడ్‌ చేయవచ్చు. లేదంటే మారుస్తారు. దీనివల్ల సరఫరాలో నాణ్యత పెరుగుతుంది. లో వోల్టేజీ–హై వోల్టేజీ లాంటి సమస్యలుండవు. ఎంత విద్యుత్తు కావాలో సబ్‌ స్టేషన్‌ స్థాయి నుంచే తెలుస్తుంది కనుక అంత మేరకు రైతులకు చేరుతుంది. 

మరిన్ని వార్తలు