పోలవరం ఎత్తు తగ్గించలేదు

2 Dec, 2020 03:06 IST|Sakshi
పోలవరం పనులను పరిశీలిస్తున్న పీపీఏ బృందం సభ్యులు

స్పష్టం చేసిన పీపీఏ సీఈ ఏకే ప్రధాన్‌

ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వసామర్థ్యం తగ్గించలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్‌ ఇంజినీర్‌ ఏకే ప్రధాన్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించారన్న ప్రచారం అపోహేనని కొట్టేశారు. ఆయన మంగళవారం పీపీఏ సభ్యులు మోహన్‌ శ్రీరామ్‌దాస్‌(డీఈ), అమిత్‌సింగ్‌(సీఈ–పవర్‌ సెక్టార్‌)లతో కలిసి పోలవరం పనుల్ని పరిశీలించారు. స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీట్‌ పనులు, స్పిల్‌వే పనులు, గ్యాప్‌–3 ప్రాంతాల్లో జరుగుతున్న పనులను చూశారు. పనుల పురోగతిని ప్రాజెక్టు ఎస్‌ఈ ఎం.నాగిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఏకే ప్రధాన్‌ విలేకరులతో మాట్లాడుతూ డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌)కు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉంటుందని, నీటి నిల్వసామర్థ్యం 194.6 టీఎంసీలు ఉంటుందని స్పష్టం చేశారు.

మొదటి సంవత్సరం 41.5 మీటర్ల ఎత్తు మేరకు నీటిని నిల్వ చేస్తారని చెప్పారు. రిజర్వాయర్‌ ప్రొటోకాల్‌ ప్రకారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తయ్యే క్రమాన్నిబట్టి నీటి నిల్వ సామర్థ్యం ఏటా పెరుగుతుందని తెలిపారు. నాలుగైదేళ్లలో పూర్తిస్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ చేస్తారని చెప్పారు. ఇప్పటికే కాంక్రీట్, హెడ్‌ వర్క్స్‌ పనులు 76 శాతం పూర్తయ్యాయన్నారు. మొత్తం ఆర్‌ అండ్‌ ఆర్, అన్ని పనులు కలిపి 41 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా.. కష్టమైన సమయంలో కూడా పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం ఈఈ ఆదిరెడ్డి, డీఈలు బాలకృష్ణ, రామేశ్వర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. పీపీఏ సీఈ ప్రధాన్, సభ్యులు బుధవారం కూడా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా