సీనియర్‌ రెసిడెంట్లకు భారీగా స్టైఫండ్‌ పెంపు: ఏకే సింఘాల్‌

2 Jun, 2021 19:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ను రూ. 45 వేల నుంచి 75 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు ఉన్నారని.. పెంచిన స్టైఫండ్‌ వీరికి వర్తిస్తుందని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉన్న జూనియర్‌ డాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు.  అలాగే రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 800 మంది డాక్టర్లకు స్టైఫండ్‌ పెంచాలని వారు కోరారని.. పీజీ వైద్యుల డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు.   

విదేశాలకు వెళ్లేవారికి  మొదటి ప్రాధాన్యత
అనంతరం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ.. '' ఏపీలో తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించాం. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తయ్యాయి. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైంది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులకు వ్యాక్సినేషన్‌ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాలి. గతంలో ఆధార్ నెంబరుతోనే కోవిన్ పోర్టల్లో రిజిస్టర్‌ చేసుకునేవారు. తాజాగా పాస్ పోర్టు నెంబరును కూడా కోవిన్ పోర్టల్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. అని తెలిపారు

చదవండి: ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు

మరిన్ని వార్తలు