గిరిజన గురుకులాల్లో అక్షర యజ్ఞం

27 Feb, 2021 05:00 IST|Sakshi

గణితం, ఆంగ్లం, తెలుగుపై ప్రత్యేక తర్ఫీదు 

ప్రమాణాలు పెంపొందించేందుకు 50 రోజులు ప్రత్యేక కార్యక్రమం 

ఉపాధ్యాయులకు బాధ్యతల కేటాయింపు 

విద్యార్థి ప్రగతిని రోజూ నివేదించేందుకు యాప్‌ 

పురోగతిని నేరుగా యాప్‌ ద్వారా పరిశీలిస్తున్న కార్యదర్శి 

కొయ్యూరులో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి లేఖే అక్షర యజ్ఞానికి ప్రేరణ

సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అక్షర యజ్ఞం మొదలైంది. గురుకుల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 45 శాతం మంది విద్యార్థులకు సబ్జెక్టులపై సరైన పట్టు లేదని గురుకుల కార్యదర్శి నిర్వహించిన బేస్‌లైన్‌ టెస్ట్‌లో స్పష్టం కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 190 గిరిజన గురుకుల విద్యాలయాలు ఉండగా వీటిని 9 రకాలుగా విభజించారు. వేర్వేరు గురుకులాల్లో 28,237 మంది బాలురు, 19,149 మంది బాలికలున్నారు. కో ఎడ్యుకేషన్‌లో 3,664 మంది చదువుతున్నారు. మొత్తంగా చూస్తే గిరిజన గురుకులాల్లో 51,040 మంది విద్యార్థినీ విద్యార్థులున్నారు. 

మూడు సబ్జెక్టుల్లో తర్ఫీదు.. 
గురుకుల కార్యదర్శి నిర్వహించిన బేస్‌లైన్‌ టెస్ట్‌లో 20 వేల మందికి పైగా విద్యార్థులు సగటు కంటే తక్కువ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో విద్యార్థులకు గణితం, ఆంగ్లం, తెలుగులో ప్రమాణాలు పెంపొందించేందుకు 15 రోజుల క్రితం గురుకుల సొసైటీ 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రతి పది రోజులకు ఒక అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు.  

ప్రత్యేక యాప్‌తో నిత్యం పరిశీలన.. 
గురుకులాల్లో అక్షర యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు కార్యదర్శి ప్రత్యేక యాప్‌ను తయారు చేయించారు. రోజూ ఈ యాప్‌ ద్వారా మూడు సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని ఉపాధ్యాయుడు వివరించాలి. కార్యదర్శి ప్రతి స్కూలులో విద్యార్థుల ప్రమాణాలను ర్యాండమ్‌గా పరీక్షించి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. 

సంబంధిత ఉపాధ్యాయులకు బాధ్యతలు.. 
విద్యార్థులు మూడు సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించేందుకు సంబంధిత ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. 50 రోజుల్లో గణితం, ఇంగ్లిష్, తెలుగులో పరిపూర్ణమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులకు కేటాయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై కొరడా ఝుళిపించేందుకు సైతం గురుకుల సంస్థ సన్నద్ధమైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ 50 రోజుల కార్యక్రమంలో ఉన్నారు.

వారికి అన్నీ ఒకటే! 
గురుకులాల్లో చదువుతున్న పీవీటీజీ విద్యార్థులతో పాటు పలు ఏజెన్సీ ఏరియాల్లో పిల్లలు వారి సొంత భాషలో మాట్లాడతారు. ఆ భాషలకు లిపిలేదు. అందువల్ల ఆ భాషలో బోధించే అవకాశం లేదు. వారు తెలుగు, ఇంగ్లిష్, హిందీని పరాయి భాషల మాదిరిగానే భావించే అవకాశం ఉన్నందున దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి లేఖే ప్రేరణ 
‘50 రోజుల అక్షర యజ్ఞానికి విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని కొయ్యూరు బాలుర గురుకుల స్కూలు విద్యార్థి ఆత్మహత్య ఘటనే ప్రేరణగా నిలిచింది. స్కూళ్లు  ప్రారంభమయ్యే సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ విద్యార్థి తనకు తెలుగు రాదని  లేఖలో పేర్కొన్నాడు. తనను తల్లిదండ్రులు చదువు రాని వాడు అంటున్నారని, స్నేహితులు గేలి చేస్తున్నారని మనస్థాపం చెందాడు. ఆ విద్యార్థి లేఖ నన్ను కదిలించింది. అందుకే బేస్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నాం. విద్యా ప్రమాణాల విషయంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులే బాధ్యులు. గిరిజన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు. వారిలో పట్టుదల ఎక్కువ. ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటే వారు ప్రపంచాన్ని జయిస్తారు’ 
– కె. శ్రీకాంత్‌ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీ, తాడేపల్లి 

మరిన్ని వార్తలు