తిరుమలలో భక్తులకు సకల సౌకర్యాలు

19 Apr, 2022 03:35 IST|Sakshi
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ

కోవిడ్‌ తగ్గుముఖం పట్టడం, వేసవి సెలవులతో భారీగా వస్తున్న భక్తులు 

రంగంలోకి అదనపు సిబ్బందిని దించిన టీటీడీ 

బ్రేక్‌ దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకే పెద్దపీట 

నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ 

ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షిత తాగునీరు 

24 గంటలపాటు క్షురకుల సేవలు 

తిరుమల: కోవిడ్‌ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు సిబ్బందిని దింపి భక్తులకు అన్ని రకాల సేవలు అందిస్తోంది. అన్నప్రసాద కేంద్రాలు, క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లతోపాటు ప్రత్యేకంగా ఫుడ్‌ కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం, పాలు, అన్నప్రసాదం పంపిణీ చేస్తోంది. ఆయా విభాగాల అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే.. దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే లక్ష్యంతో ఈ నెల 17 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తుల మధ్య తోపులాట లేకుండా చూస్తున్నారు.  

పరిశుభ్రంగా క్యూ కాంప్లెక్స్‌లు 
మరోవైపు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లోనూ మెరుగైన పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రధాన కల్యాణకట్టతోపాటు మినీ కల్యాణకట్టల్లో 24 గంటలపాటు క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. తిరుమలలో రోజూ 1,700 మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తుండగా.. తిరుపతిలో మరో 300 మంది స్థానిక ఆలయాల్లో భక్తులకు సేవలు అందిస్తున్నారు. మరో 200 మంది పరకామణి సేవల్లో ఉన్నారు. భక్తుల లగేజీ కౌంటర్ల వద్ద కూడా అదనపు సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ 

ఈ నెల 11 నుంచి 17 వరకు తిరుమలను దర్శించిన భక్తులు, వారికి అందిన సేవలు..   
► శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 5,29,926 
► తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 2,39,287 
► అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు: 10,55,572
► భక్తులకు కేటాయించిన గదులు: 30,650  
► అశ్విని ఆస్పత్రిలో వైద్యసేవలు పొందిన భక్తుల సంఖ్య: 10,768

రద్దీకి అనుగుణంగా.. 
తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే లక్ష్యంతో గత వారంలో నాలుగు రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా రద్దు చేశాం. సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుడ్‌ కౌంటర్లలో భక్తులకు నిరంతరాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నాం. భక్తులు సంచరించే అన్ని ముఖ్య ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాం. గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లోనే శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నాం. సోమవారం నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించాం.  
– ఎ.వి.ధర్మారెడ్డి, అదనపు ఈవో, టీటీడీ

కాస్త తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఆదివారం 68,299 మంది భక్తులు దర్శించుకోగా 26,421 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.90 కోట్లు కానుకల రూపంలో వేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.  

మరిన్ని వార్తలు