పీజీ సెట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

26 Sep, 2020 14:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ పీజీ సెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు జరుగుతాయని పీజీ సెట్ కన్వీనర్ పీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీజీ సెట్ కోసం 13 పరీక్షలు మూడు రోజుల పాటు జరగనున్నాయని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పీజీ సెట్‌కు 28,726 మంది హాజరవుతున్నారని, వీరిలో పురుషులు 16,607, మహిళలు 12,119 మంది ఉన్నారని తెలిపారు.

ఉదయం పరీక్ష రాసే వారికి 8:30 నుంచి 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం పరీక్ష రాసే వారికి 1:30 వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఒక నిమషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష రాసే వారు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు.

మరిన్ని వార్తలు