ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం: మంత్రి కొట్టు

14 Oct, 2023 17:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాల ఏర్పాట్లను శనివారం.. మంత్రి పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ భక్తుడికి అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓమ్ టర్నింగ్ వరకూ మూడు క్యూలైన్లు.. అక్కడి నుంచి ఐదు వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. కేశ ఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల కొండ చరియలు విరిగిపడిన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

‘‘సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టాం. 3,500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం. 500 రూపాయల తీసుకున్న వారికి ముఖమండపం నుంచి దర్శనం. భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లు లో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

మూలా నక్షత్రం రోజు సీఎం రాకకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశాం. గతేడాది సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అందుకే ఈసారి బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, ఏసీటీ నుంచి కనెక్షన్లు తీసుకున్నాం. వృద్ధులకు దర్శనం కోసం ఉదయం, సాయంత్రం రెండు ప్రత్యేక స్లాట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్‌ ప్రభుత్వం

మరిన్ని వార్తలు