344 పంచాయతీల్లో 9608 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు

27 Jan, 2021 16:37 IST|Sakshi

సాక్షి, విశాఖ: జిల్లాలో తొలి విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్‌ చంద్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని,  అందులో తొలి విడతగా అనకాపల్లి డివిజన్‌లోని 344 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  తొలి విడతలో మొత్తం 9608 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, అందుకు కావాల్సిన 8122 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. 

అనకాపల్లి డివిజన్ లో మొత్తం 240 సమస్యాత్మక కేంద్రాల గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29 నుంచి 31 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి తాను కూడా పాల్గొన్నానని వివరించారు. 

ఇదిలా ఉండగా జిల్లాలో తొలి విడత ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీలో జోష్ కనిపిస్తుంది. అనకాపల్లి డివిజన్‌కు సంబంధించి మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో టీడీపీ పోటీ నామమాత్రమే అని తెలుస్తోంది. ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపిస్తాయని పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తుంది. 
 

మరిన్ని వార్తలు