AP: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి సర్వం సిద్ధం

31 Mar, 2022 18:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: వై​ఎస్సార్‌ పెన్షన్ కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా 61.03 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ద, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్‌

శుక్రవారం (ఏప్రిల్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1551.16 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారని తెలిపారు. సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెన్షన్ మొత్తాలను నగదు రూపంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందచేస్తారన్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్దంగా ఉన్నారన్నారు.

పెన్షన్ అందచేసే సందర్భంలో లబ్ధిదారులను గుర్తించేందుకు బయోమెట్రిక్ తో పాటు ఐరిస్, ఆర్బిఐఎస్ విధానాన్ని కూడా వినియోగిస్తారని తెలిపారు. పెన్షన్ మొత్తాలను అయిదు రోజుల్లో నూరుశాతం పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 15 వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్డిఏ కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు