‘విద్యుత్‌’కు సైబర్‌ ముప్పు!

24 Nov, 2020 05:15 IST|Sakshi

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర విద్యుత్‌ శాఖ

విదేశీ విద్యుత్‌ ఉపకరణాల దిగుమతిలో జాగ్రత్తగా ఉండాలని సూచన

ఏ చిన్న వస్తువుకైనా పరీక్ష తప్పనిసరి

సాక్షి, అమరావతి: సైబర్‌ మూకలు విద్యుత్‌ నెట్‌వర్క్‌పై దాడులకు పాల్పడే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. విదేశీ విద్యుత్‌ ఉపకరణాల దిగుమతిలో కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తాము సూచించిన ల్యాబొరేటరీలో పరీక్ష జరపకుండా ఏ ఒక్క వస్తువునూ పవర్‌ సెక్టార్‌లోకి తీసుకోవద్దంటూ ఇటీవల ఆదేశించింది. దీంతో రాష్ట్ర విద్యుత్‌ శాఖ అప్రమత్తమై.. పలు చర్యలు తీసుకుంది. విద్యుత్‌ అనేది ప్రధాన జాతీయ మౌలిక వనరు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైనది. కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం ప్రకారం.. విద్యుత్‌ వ్యవస్థపై సైబర్‌ దాడి చేస్తే తక్షణమే కోలుకునే అవకాశం ఉండదు.

ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్‌తో అనుసంధానం కానీ విద్యుత్‌ సరఫరా ఎక్కడా లేదు. జాతీయ, రాష్ట్రీయ గ్రిడ్‌లో కమ్యూనికేషన్‌ సిస్టం ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలన్నీ గ్రిడ్‌కే లింక్‌ అయ్యి ఉంటాయి. విద్యుత్‌ వాడకం పెరిగినా.. తగ్గినా గ్రిడ్‌ కంట్రోల్‌ చేయకపోతే క్షణాల్లో నష్టం భారీగా ఉంటుంది. కీలకమైన లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్స్‌లోని ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలు కూడా ఇంటర్నెట్‌కు లింక్‌ అయ్యి ఉంటాయి. విద్యుత్‌ సెక్టార్‌లో వాడే ఉపకరణాలను దాదాపుగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. వీటి తయారీలో సాఫ్ట్‌వేర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సైబర్‌ మూకలు విద్యుత్‌ ఉపకరణాల ద్వారా వైరస్‌లను పంపే అవకాశముందని కేంద్రం పేర్కొంది. 

 ప్రత్యేక ల్యాబొరేటరీ..
ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విదేశీ ఉపకరణాలను పరీక్షించేందుకు కేంద్రం ప్రత్యేకంగా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఇవి కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. దిగుమతి అయిన ఉపకరణాల నాణ్యత, వాటి సెక్యూరిటీని ఇవి పరిశీలిస్తాయి. అవి ధ్రువీకరించిన తర్వాతే ఉపకరణాలను విద్యుత్‌ సంస్థలు అనుమతించాలని కేంద్రం సూచించింది. ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు కూడా ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా