కరోనాపై ప్రత్యేక దృష్టి సారించాలి

24 Mar, 2021 04:10 IST|Sakshi

వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి

మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌

సాక్షి, అమరావతి: కరోనాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా గురించి ప్రజలకు మరింత తెలిసేలా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్ని వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో 60 ఏళ్లు, 45– 59 ఏళ్ల వయసు ఉన్నవారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని జిల్లాల్లో కరోనా కట్టడికి అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

కరోనా కట్టడిలో అన్ని వాణిజ్య, వ్యాపార, ప్రజా, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కోరారు. జిల్లా, మండల స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యపరచాలన్నారు. అన్ని హోటళ్లు, షాపింగ్‌ మాళ్లు, విద్యా సంస్థల్లో సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ, పట్టణ, మండల స్థాయిల్లో క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. మాస్కులు లేకుండా ఎవరూ బయట తిరగొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు