కోవిడ్‌ నివారణకు త్రిముఖ వ్యూహం ఫలించింది

3 Dec, 2020 04:17 IST|Sakshi

 కరోనాను ఎదుర్కోవడంలో అత్యంత పటిష్ట చర్యలు తీసుకున్నాం

దేశానికే ఆదర్శంగా నిలిచాం.. ఇతర రాష్ట్రాల ప్రశంసలే దీనికి నిదర్శనం

డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత లేకుండా 22 వేల తాత్కాలిక నియామకాలు చేశాం

కరోనాకు చికిత్సను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం..

శాసనమండలిలో కోవిడ్‌పై చర్చకు సమాధానమిచ్చిన మంత్రి ఆళ్ల నాని  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన త్రిముఖ వ్యూహం ఫలించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు త్రిముఖ వ్యూహమైన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌తో కరోనాను ఎదుర్కొన్నామన్నారు. శాసన మండలిలో కోవిడ్‌పై జరిగిన చర్చ సందర్భంగా బుధవారం మంత్రి సమాధానమిచ్చారు. దేశంలోనే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ‘‘కోవిడ్‌ సమయంలో సీఎం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శకాలిచ్చారు. సమష్టి కృషితో కోవిడ్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ప్రధాని, జాతీయ మీడియా, ఇతర రాష్ట్రాల సీఎంలు మన రాష్ట్రాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాం. మిలియన్‌ జనాభాకు దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఉన్నాం. పాజిటివ్‌ కేసులను గుర్తించి చికిత్స అందిస్తేనే రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రించగలమనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్లింది. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ రేటు ఆగస్టు నెలలో 17.2 శాతం ఉంటే నవంబర్‌లో 8.63 శాతానికి తగ్గింది. ఇక దేశంలో రికవరీ రేటు 93.68 శాతంగా ఉంటే రాష్ట్రంలో 97.86 శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 1.46 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.81 శాతంగా ఉంది’’ అని మంత్రి తెలిపారు. 

ఒక్క ల్యాబ్‌ లేని పరిస్థితి నుంచి..  
మొదట్లో ఒక టెస్ట్‌ చేయాలంటే శాంపిల్‌ తీసి పరీక్షకోసం ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వచ్చేదని, రాష్ట్రంలో ఒక్క ల్యాబ్‌ లేని పరిస్థితి నుంచి 8 నెలల్లోనే 150 ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని మంత్రి చెప్పారు. పీహెచ్‌సీ నుంచి టీచింగ్‌ ఆసుపత్రి వరకు మొత్తం 1,519 శాంపిల్‌ కలెక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత లేకుండా 22 వేల మందికి పైగా తాత్కాలిక నియామకాలు చేశామని, వీరి జీతాలకోసం రూ.232 కోట్లు విడుదల చేశామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న మరో రూ.200 కోట్లు త్వరలో విడుదల చేస్తామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదని పేర్కొన్నారు. కరోనా బారిన పడి చికిత్స పొందిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్‌ చేస్తామని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీతోపాటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్‌ కాలేజీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రూ.16 వేల కోట్లతో ప్రతి ఆసుపత్రినీ ఆధునీకరిస్తామని చెప్పారు.   

మరిన్ని వార్తలు