ఆదర్శం.. ‘ప్రగతి భారత్‌’ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌

15 May, 2021 04:56 IST|Sakshi
కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చిత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి తదితరులు

కార్పొరేట్‌ స్థాయిని మించి ఉంది

మల్టీటైర్‌ ఆక్సిజన్‌ విధానంతో రోగులకు పూర్తి భద్రత

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

సాక్షి, విశాఖపట్నం: ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశాఖలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ రాష్ట్రానికే ఆదర్శమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. షీలానగర్‌లోని వికాస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను శుక్రవారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు.. కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిని మించి ఉందన్నారు. ఇందులోని మల్టీటైర్‌ (నాలుగంచెల) ఆక్సిజన్‌ సరఫరా విధానం రోగులకు పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అంతరాయం కలగదన్నారు. రాష్ట్రంలో అన్ని కోవిడ్‌ ఆస్పత్రులు ఈ విధానాన్ని పాటిస్తే విషాద ఘటనలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ఇలాంటి కోవిడ్‌ కేర్‌ సెంటర్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దీన్ని ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ దీని నిర్వహణతోపాటు మౌలిక సదుపాయాలను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్‌ నియంత్రణలో ఏపీ ఎంతో మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. 

రోగులు ఇబ్బంది పడకూడదనే..
ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయాలకనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో, పూర్తి సాంకేతికతతో ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్‌ అందక రోగులు ఇబ్బంది పడకూడదనే దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆక్సిజన్‌కు అంతరాయం లేకుండా ఒక్కొక్కటి 3,750 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో రెండు ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్యాంకుల ద్వారా సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఒక్కోటి 60 లీటర్ల సామర్థ్యం కలిగిన 200 ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. వీటికి అంతరాయం ఏర్పడితే ఒక్కో రోగి బెడ్‌ వద్ద 47 లీటర్ల సామర్థ్యం కలిగిన 150 సిలిండర్లను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు