ప్రమాద ఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి

9 Aug, 2020 11:09 IST|Sakshi

సాక్షి, కృష్ణా: కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన ‌అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న మంత్రి ఆళ్లనాని ఘటనా స్థలానికి బయలుదేరారు.

అగ్ని ప్రమాద ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో ఫోన్లో మాట్లాడారు. బాధితులను ఆదుకునే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు, ప్రమాద కారణాలు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులను ఆదుకుంటుందని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, రాష్ట్ర సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 50లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు