కరోనా మృతదేహాలపై ఆభరణాలు మాయం; ఆళ్లనాని సీరియస్‌

25 Sep, 2020 13:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్‌లో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయం వ్యవహారంపై ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మంత్రి నాని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాయమైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్స్ వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు అందచేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీచేశారు. తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి పై స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మఅలిపిరి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై  పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.  (టీడీపీ ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసింది)

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్‌లో జరిగిన ఈ సంఘటనపై మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌ రెడ్డి కరోనా బాధితులకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం మెరుగుదలకు కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్స్ గాని, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గాని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. 

కరోనా మృతుని రింగ్, సెల్‌ఫోన్‌ మాయం!
తిరుపతి తుడా: తిరుపతి స్విమ్స్‌ శ్రీపద్మావతి స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రిలో కరోనాబారిన పడి మృతిచెందిన వ్యక్తి నుంచి బంగారు ఉంగరంతో పాటు సెల్‌ఫోన్‌ మాయం కావడం విమర్శలకు తావిచ్చింది. కొన్ని రోజులుగా స్విమ్స్‌ కోవిడ్‌ ఆసుపత్రిలో మృతదేహాలపై బంగారు  ఆభరణాలు మాయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి, ఈ నేపథ్యంలో చౌడేపల్లెకు చెందిన వెంకటరత్నంనాయుడు పదిరోజుల క్రితం మృతి చెందాడు. ఈ మృతదేహం చేతికి ఉన్న బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన మొబైల్‌ను పీపీకిట్లతో విధుల్లో వున్న ఓ వ్యక్తి అపహరించడం గురువారం సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. కరోనా మృతుల ఆభరణాలు, మొబైల్‌ ఫోన్లను దొంగిలిస్తున్న ఉదంతాలు స్విమ్స్‌ ప్రతిష్టకు మచ్చలా మారింది. ఇకనైనా అధికారులు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఎంతైనా ఉంది. 

మరిన్ని వార్తలు