జాబ్‌ కోసం ఫేక్‌?

26 Aug, 2020 15:06 IST|Sakshi

సాక్షి, నెల్లూరు(అర్బన్‌): జిల్లా వైద్యారోగ్య శాఖలో నర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా కొందరు ఫేక్‌ మార్కుల జాబితాలతో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. 

ఎలా వచ్చాయి?
మొదటిసారి ప్రకటించించిన జాబితాలో ఓ అభ్యర్థికి 1014 మార్కులున్నట్లుగా చూపారు. ఫైనల్‌ మెరిట్‌ జాబితాలో 811 మార్కులని ఉంది. అలాగే ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాలో 65, 73, 76, 93 ఇలా ఓ పదిమందికి సంబంధించిన ర్యాంకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నర్సింగ్‌ కోర్సులో తక్కువ మార్కులు వచ్చినా ప్రకటించిన ప్రొవిజనల్‌ జాబితాలో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయని పలువురు అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అభ్యంతరాలు స్వీకరించినా సోమవారం ఫైనల్‌ మెరిట్‌ జాబితాను ప్రచురించామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఆ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

ఒక్కసారిగా..
ఏమి జరిగిందో గానీ మార్కుల జాబితాలో పైన పేర్కొన్న పలువురి ర్యాంకులు తలకిందులయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా లిస్ట్‌ను మార్పు చేశారు. అప్పటివరకు ఎక్కువ మార్కులు పొంది, మెరిట్‌ లిస్ట్‌లో ముందు వరుసలో ఉన్న కొందరికి తక్కువ మార్కులు చూపిస్తూ రెండో జాబితాను వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. దీంతో ర్యాంకుల పరంగా ఒక్కసారిగా వారు వెనక్కు వెళ్లిపోయారు. ఈ విషయంపై డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒకరికి పొరపాటున మార్కులు ఎక్కువ పడ్డాయని వాటిని సరి చేశామన్నారు. మరో ఏడుగురి సర్టిఫికెట్లæపై సందేహాలున్నాయన్నారు.

ఇదిలా ఉండగా డీఎంహెచ్‌ఓ కార్యాలయం పరిధిలో నర్సింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు వైద్యవిధాన పరిషత్‌లోని (ఏపీవీపీ) పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏపీవీపీలోని పోస్టుల్లో కూడా తమ నర్సింగ్‌ కోర్సులో ఎక్కువ మార్కులు పొందినట్లుగా చూపారు. ఇదే అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం పరిశీలిస్తే డీఎంహెచ్‌ఓ పోస్టులకు సంబంధించి ప్రదర్శించిన జాబితాలో తక్కువ మార్కులు ఉండడం.. ఏపీవీపీ పోస్టుల్లో ఎక్కువ మార్కులుండడాన్ని చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయమై డీసీహెచ్‌ చెన్నయ్యను వివరణ కోరగా నర్స్‌ పోస్టు కోసం ఒకరు దరఖాస్తు చేసిన మార్కుల జాబితాపై ఫిర్యాదు అందిందన్నారు. దానిని పరిశీలించేందుకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరగా ఆమె ఈ రోజు వస్తానని చెప్పి రాలేదన్నారు. దీనిని బట్టి చూస్తే ఆమెది ఫేక్‌ మార్కుల జాబితా అయి ఉండవచ్చన్నారు. ఉద్యోగాల్లో చేర్చుకునేప్పుడు అన్ని మార్కుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేసినట్లుగా తేలితే వారిపై చర్యలు చేపడతామన్నారు. 

జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం

మరిన్ని వార్తలు