ఈఏపీసెట్‌లో 80,935 సీట్ల కేటాయింపు

17 Nov, 2021 05:05 IST|Sakshi

తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ 

ప్రైవేటు వర్సిటీల్లో 2,012 సీట్లు కూడా.. 

కన్వీనర్‌ కోటాలో ఇంకా అందుబాటులో 30 వేల సీట్లు 

మెరిట్‌ జాబితా రానందున స్పోర్ట్స్, ఎన్‌సీసీ కేటగిరీల్లో కేటాయించని సీట్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌–2021లో 80,935 మంది విద్యార్థులకు తొలివిడత సీట్లు కేటాయించారు. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఈ వివరాలు విడుదల చేశారు. మొత్తం 437 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాకు 1,11,304 సీట్లు ఉండగా 80,935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30,369 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్‌ కేటగిరీలో 488, ఎన్‌సీసీలో 976 మందికి సంబంధించిన ఫైనల్‌ మెరిట్‌ లిస్టు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌), ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ల నుంచి ఇంకా అందనందున కేటాయించలేదని తెలిపారు.  

ఆప్షన్లు ఇచ్చింది 89,898 మంది 
ఏపీ ఈఏపీసెట్‌–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,75,796 మంది ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు, 83,051 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు దరఖాస్తు చేశారు. అర్హత సాధించిన 1,34,205 మందిలో 90,606 మంది తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారిలో 90,506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులుకాగా 89,898 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరిలో 80,935 మందికి తొలివిడతలో సీట్లు కేటాయించారు.

 
సీట్లు కేటాయించని కాలేజీ లేదు 
254 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,06,236 సీట్లకుగాను 80,520 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25,716 సీట్లున్నాయి. 121 బీఫార్మసీ కాలేజీల్లో 4,386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4,034 సీట్లున్నాయి. 62 ఫార్మా–డీ కాలేజీల్లో 682 సీట్లుండగా 63 భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లున్నాయి. తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒక్కటీ లేకపోవడం విశేషం. గతంలో ఒక్కసీటు కూడా భర్తీకానివి 10  వరకు ఉండేవి. ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. 

తొలిసారి ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్‌ కోటా 
తొలిసారిగా ప్రైవేటు వర్సిటీలు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – అమరావతి, ఎస్‌ఆర్‌ఎం, బెస్ట్‌ యూనివర్సిటీ, సెంచూరియన్‌ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద 2,012 సీట్లను పేద మెరిట్‌ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. వీరికి ఇతర విద్యార్థులకు మాదిరిగానే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లబ్ధి చేకూరనుంది. 

మరిన్ని వార్తలు