15 టన్నుల బరువు.. 30 అడుగుల పొడవు

29 Jun, 2022 04:32 IST|Sakshi
సిద్ధమైన అల్లూరి కాంస్య విగ్రహం

భీమవరం చేరుకున్న అల్లూరి కాంస్య విగ్రహం 

సాక్షి, భీమవరం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది. పట్టణంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మునిసిపల్‌ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువు గల అల్లూరి విగ్రహాన్ని పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్‌ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.

ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్‌పీజీ ఏఐజీ
కాగా, ప్రధాన మంత్రి భీమవరం ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో∙ఎస్‌పీజీ ఏఐజీ హిమాన్షు గుప్త, కేంద్ర కల్చరల్‌ డైరెక్టర్‌ అతుల్‌ మిశ్రా, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్‌ హెలీప్యాడ్‌ స్థలం, బహిరంగ సభ స్థలాలను మంగళవారం పరిశీలించారు.

అనంతరం హిమాన్షు గుప్త మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐజీ పాలరాజు, సెక్యూరిటీ ఐజీ శశిధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, కోనసీమ ఎస్పీ సుదీప్‌కుమార్‌రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు