అల్లూరి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా.. 

30 Jun, 2022 18:17 IST|Sakshi

అట్టహాసంగా మన్యంవీరుడి 125వ జయంతి ఉత్సవాలు

వచ్చేనెల 4న ప్రధాని మోదీ రాక 

గవర్నర్, ముఖ్యమంత్రి హాజరు

రూ.3 కోట్లతో 30 అడుగుల అల్లూరి విగ్రహ నిర్మాణం 

సభా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, అధికారులు 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు వచ్చేనెల 4న భీమవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భీమవరంలో సభా ప్రాంగణం ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్‌ ఎస్పీజీ, ఏఐజీ హిమాన్షుగుప్త, కేంద్ర కల్చరల్‌ డైరెక్టర్‌ అతుల్‌మిశ్రాలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా పరమైన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. 


బుధవారం సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జీఐడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్‌ అధికారి రేవు ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్‌ భార్గవ్‌లు సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్‌ను పరిశీ లించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాని సభావేదిక, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీతోపాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు.


ప్రధాని పర్యటన ఖరారైన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భీమవరంలో ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ ప్రాంతాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ గడపగడపకు మన ప్రభుత్వం ఇన్‌చార్జి, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు ఏర్పాట్లను పరిశీలించారు. 


భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం 

భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మున్సిపల్‌ పార్కు లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగనుంది. వచ్చేనెల 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని, ముఖ్యమంత్రి చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించి పార్కులో ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.   

పకడ్బందీ ఏర్పాట్లు 
సాక్షి, భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జీఏడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్‌ అధికారి రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆయన సమావేశమై ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అధికారులు, నోడల్‌ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి పీఎంఓ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి వెళ్లే మార్గాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ప్యాకెట్లు, అల్పాహారం, బయో టాయిలెట్స్‌ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత భార్గవ్‌తో కలిసి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు.   

మరిన్ని వార్తలు