పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం

6 Aug, 2022 16:46 IST|Sakshi

కరోనా దెబ్బకు కుదేలైన పర్యాటక రంగం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో పుంజుకుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, డముకు వ్యూ పాయింట్, కటికి, తాటిగుడ జలపాతాలు, అరకులోయలో పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్, డుంబ్రిగుడలోని చాపరాయి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.   


అనంతగిరి/అరకులోయ:
కరోనా కారణంగా మన్యంలో మూతపడిన పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభమైన తరువాత మండలంలోని బొర్రా గుహలతో పాటు మిగతా వాటికి  సందర్శకులు తాకిడి పెరిగింది. గత రెండేళ్ల కన్నా ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 2020 సంవత్సరంలో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 1,80,260 మంది సందర్శించగా  రూ.131.35 లక్షల ఆదాయం లభించింది. 


2021 సంవత్సరంలో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 2,61,000 మంది సందర్శించగా రూ.187 లక్షల ఆదాయం సమకూరింది.  2021 సంవత్సరం కంటే ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య సుమారు 80 వేలు అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి  జూలై వరకు 2,22,653 మంది సందర్శించగా రూ.161.21 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు సుమారు మూడు లక్షల మంది సందర్శించగా సుమారు రూ.200 లక్షలు ఆదాయం లభించింది. 


అరకులోయలో... 

గత ఏడాది అక్టోబర్‌ నెల నుంచి అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియంతో పాటు చాపరాయి జలపాతం ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా తరలివస్తున్నారు. గత 12నెలల్లో అరకులోయ గిరిజన మ్యూజియాన్ని  3 లక్షల మంది,  పద్మాపురం గార్డెన్‌ను సుమారు 2.50 లక్షల మంది సందర్శించారు. సుమారు రూ.2 కోట్ల ఆదాయం లభించింది. చాపరాయి జలపాతం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరగడంతో టూరిజంశాఖకు చెందిన రిసార్టులు, రెస్టారెంట్ల ఆదాయం భారీగా సమకూరుతోంది. (క్లిక్‌: వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్‌ వజ్రం కూడా అక్కడే..)


పెరిగిన పర్యాటకులు 

బొర్రా గుహలను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. బొర్రాలోని సదుపాయలు కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.  
– బాబుజీ డీవీఎం పర్యాటకశాఖ

మరిన్ని వార్తలు