హైకోర్టు ఉత్తర్వులా.. డోంట్‌ కేర్‌

2 Nov, 2021 03:56 IST|Sakshi
ఫ్యాక్టరీల ప్రాంగణంలో ఎయిమ్స్‌ వైద్యుల బృందం

అమర్‌రాజా యాజమాన్యం లెక్కలేనితనం 

కోర్టు ఆదేశాల మేరకు కార్మికులకు వైద్య పరీక్షలు చేసేందుకు వెళ్లిన వైద్యులకు సహాయ నిరాకరణ 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికార వ్యవస్థలను కనీసం ఖాతరు చేయని అమర్‌రాజా సంస్థల యాజమాన్యం చివరకు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. టీడీపీకి చెందిన  ఎంపీ గల్లా జయదేవ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీల విష కాలుష్యంపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీల చుట్టుపక్క గ్రామాల ప్రజలు, పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది.

కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని నాలుగు రోజుల కిందట కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి అమర్‌రాజా ఫ్యాక్టరీల్లోని కార్మికులకు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా మంగళగిరి ఎయిమ్స్‌కు పీసీబీ బాధ్యతలు అప్పగించింది.  

వేచిచూసి వెనుదిరిగిన వైద్యులు 
దీంతో 20 మంది ఎయిమ్స్‌ వైద్యుల బృందం సోమవారం ఉదయం 9 గంటలకు తిరుపతికి సమీపంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో గల అమర్‌రాజా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా మహిళా వైద్యుల బృందం కూడా విచ్చేసింది. కానీ ఒక్కరంటే ఒక్క కార్మికుడిని కూడా వైద్యుల వద్దకు ఫ్యాక్టరీ యాజమాన్యం పంపించలేదు. ఉదయం షిఫ్ట్‌లో వెయ్యిమందికి పైగా కార్మికులున్నా  వైద్యులు ఉన్న రూమ్‌ వైపునకు ఎవరూ పోలేదు. కార్మికులను  పంపాలంటూ వైద్యులు ఎన్నిసార్లు అడిగినా ఫ్యాక్టరీ సంబంధీకుల నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది.

పరీక్షలకు కార్మికులెవరూ రానంటున్నారని.. కావాలంటే వాళ్లు పనిచేస్తున్న మిషినరీ వద్దకు వెళ్లి అడగాలని వైద్యులకు చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘అలా చేస్తే కార్మికుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని యాజమాన్యం ఆలోచించింది. అందువల్ల మేం వైద్య శిబిరం వద్దే వేచి చూశాం’ అని ‘సాక్షి ప్రతినిధి’తో చెప్పారు. దీంతో సాయంత్రం 5.30 గంటల వరకు వేచిచూసిన తాము చేసేది లేక వెనుదిరిగామని వైద్యులు చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు