పాడి రైతులకు అమూల్య్‌ సహకారం

12 Feb, 2022 04:19 IST|Sakshi

‘సాక్షి’తో అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సో«ధి

అమూల్‌ రాకతో లీటరుకు అదనంగా రూ.9 ఆదాయం

ప్రతి మహిళకు నెలకు రూ.20,000 ఆదాయమే లక్ష్యం

ప్రతి జిల్లాలో మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు.. 

త్వరలో విశాఖ, విజయవాడ, మదనపల్లిలో ప్రారంభం

గుజరాత్‌ కంటే వేగంగా ఏపీలో విస్తరిస్తాం.. మహిళా సాధికారతకు డైనమిక్‌ సీఎం జగన్‌ కృషి బాగుంది

సాక్షి, అమరావతి: దేశంలో క్షీర విప్లవానికి నాంది పలికిన ‘అమూల్‌’(ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) ఏపీలో పాడి పరిశ్రమాభివృద్ధికి సహకారం అందిస్తోంది. 75 ఏళ్ల క్రితం గుజరాత్‌లో ఎలాంటి పరిస్థితుల్లో అమూల్‌ ఆవిర్భవించిందో ఇప్పుడు ఏపీలోనూ అదే వాతావరణంలో తాము అడుగు పెట్టినట్లు చెబుతోంది. ‘అమూల్‌ సహకార సంస్థ కావడంతో రైతులే దాని యజమానులు. లాభాల్లో వాటాలు పంచడం సహకార సంస్థల లక్ష్యం. గ్రామీణ మహిళలు ఆత్మ గౌరవంతో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.వేలల్లో  ఆదాయాన్ని ఆర్జించే మార్గం చూపడం ద్వారా సాధికారత దిశగా అమూల్‌ కృషి చేస్తోంది.

‘డైనమిక్‌ సీఎం’ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. ఇది ఆరంభం మాత్రమేనని, గుజరాత్‌ కంటే వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తామని అమూల్‌ మేనేజింగ్‌ డెరెక్టర్‌ ఆర్‌ఎస్‌ సోథి చెప్పారు. రాష్ట్రంలో అమూల్‌ కార్యకలాపాలపై ‘సాక్షి’ ప్రతినిధికి ఆయన ప్రత్యేకంగా ఇంటరŠూయ్వ ఇచ్చారు.

+ రాష్ట్రంలోకి అమూల్‌ అడుగుపెట్టి ఏడాది కావస్తోంది. ఏపీలో అమూల్‌ అనుభవాలను వివరిస్తారా?
–  గుజరాత్‌లో 75 ఏళ్ల క్రితం ప్రైవేట్‌ డెయిరీల దోపిడీతో పాడి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వారి సంక్షేమం కోసం అమూల్‌ సహకార సంస్థ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో పాడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్న విషయాన్ని గమనించారు.

పాలకు కనీసం మంచినీటి బాటిల్‌ ధర కూడా దక్కడం లేదన్న విషయాన్ని గుర్తించి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఆయన ఆహ్వానం మేరకు రాష్ట్రంలో అమూల్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 250 గ్రామాల్లో కార్యకలాపాలు ప్రారంభించాం. ఏడాదిలో ఏడు జిల్లాల్లో 859 గ్రామాలకు విస్తరించాం. చిత్తూరు కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం.

+ పాడి పరిశ్రమ విషయంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఏవైనా తేడాలను గమనించారా?
– పాల ఉత్పత్తిలో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రోజుకు నాలుగు కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 2.5 కోట్లు మిగులు పాలు ఉంటున్నాయి. 20 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉండగా 80 శాతం అసంఘటిత రంగంగా ఉంది. ఈ రంగంలో చాలా అవకాశాలున్నాయి. గుజరాత్‌లా ఆంధ్రప్రదేశ్‌లో వెన్న శాతం అధికంగా ఉండే పాలనిచ్చే గేదెలు అత్యధికంగా ఉన్నాయి. ఇది డెయిరీ రంగంలో వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తుంది.

+ అమూల్‌ రాకతో ఏపీలో పాడి రైతులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరింది?
– అమూల్‌ ప్రైవేట్‌ సంస్థ కాదు. పూర్తిగా రైతులకు చెందినది. అమూల్‌ 36 లక్షల మంది రైతులది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,000 మంది పాడి రైతులు భాగస్వాములు అయ్యారు. దేశంలో రైతులంతా కష్టపడే తత్వం కలిగినవారే. కానీ ప్రైవేట్‌ డెయిరీల చేతుల్లో మోసపోతున్నారు. మేం పాలను సేకరించి విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలను వారికే ఇస్తాం. మేం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టకముందు పాడి రైతులకు లీటరుకు రూ.30–31 మాత్రమే లభించేది. మా రాకతో సేకరణ ధర ఏడాదిలో లీటరుకు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పెరిగింది. ఇప్పుడు రైతులు లీటరుకు రూ.39 నుంచి రూ.40 వరకు పొందుతున్నారు. అమూల్‌ వెన్న శాతం ఆధారంగా రైతులకు చెల్లిస్తుంది. దీనివల్ల కొన్ని చోట్ల లీటరుకు రూ.70 వరకు పొందే అవకాశం లభిస్తోంది. ప్రైవేట్‌  డెయిరీలు చాలావరకు లీటరుకు ఒక ధరను నిర్ధారించి కొనుగోలు చేస్తాయి.

+ మహిళా సాధికారికత విషయంలో అమూల్‌ ఎలా భాగస్వామి అవుతోంది?
– మహిళా సాధికారతకు డైనమిక్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలన్నది ఆయన లక్ష్యం. అందుకే పాడి రైతుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటివద్దే ఉంటూ ఒక గేదె, ఆవును పెంచుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు. మూడు ఆవులు లేదా గేదెలను కొనుగోలు చేసి పాలు విక్రయించడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు నెలకు రూ.12,000 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనివల్ల మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో పలు ప్రయోజనాలు చేకూరతాయి. వచ్చే ఐదేళ్లలో గ్రామీణ మహిళల నెలవారీ సంపాదన రూ.20,000కి పెంచడమే అమూల్‌ లక్ష్యం. గుజరాత్‌లో నిరక్ష్యరాస్య మహిళలు కేవలం పాలు అమ్మడం ద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు.

+ రాష్ట్రంలో అమూల్‌ విస్తరణ కార్యక్రమాలు ఏమిటి?
– రెండు జిల్లాలతో ప్రారంభించి ఏడు జిల్లాలకు విస్తరించాం. త్వరలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించనున్నాం. రాష్ట్రంలో 50 నుంచి 60 శాతం గ్రామాలకు అమూల్‌ చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం ఏడు జిలాల్ల నుంచి రోజూ 
లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం. దీన్ని వచ్చే ఐదేళ్లలో 10 లక్షల లీటర్లకు చేర్చాలన్నది లక్ష్యం. ఏపీలో సేకరించిన పాలను పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తాం. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చుకుంటున్నాం.

+ రాష్ట్రంలో పెట్టుబడులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు లాంటి ఆలోచనలు ఉన్నాయా?
– ఇంకా వేగంగా పాల సేకరణను విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు లేకపోవడంతో నెమ్మదిగా విస్తరిస్తున్నాం. నెల రోజుల్లో రాష్ట్రంలో మూడు మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. మదనపల్లి, విజయవాడ, విశాఖపట్నంలో ఇవి ఏర్పాటవుతాయి. దీంతో లక్ష లీటర్ల పాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యం అమూల్‌కు ఈ నెలాఖరులోగా లభిస్తుంది. రానున్న కాలంలో దీన్ని మూడు నుంచి ఐదు లక్షల లీటర్లకు పెంచుతాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మదనపల్లిలో ప్రభుత్వ మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను లీజుకు తీసుకుంటుండగా విజయవాడ, విశాఖలో థర్డ్‌ పార్టీ ప్లాంట్‌లు నెలకొల్పుతున్నాం. విద్యార్థులకు ఫ్లేవర్డ్‌ మిల్క్, అంగన్‌వాడీలకు బాలామృతం సరఫరా కాంట్రాక్టు అమూల్‌కు లభించింది. ఇందుకోసం రూ.100 కోట్లతో త్వరలోనే సొంతంగా తయారీ యూనిట్‌ నెలకొల్పుతాం. కొద్ది నెలల్లోనే పశుదాణా తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలన్నది అమూల్‌ లక్ష్యం.  

మరిన్ని వార్తలు