మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌

26 Jun, 2022 13:24 IST|Sakshi
ధ్రువీకరణ పత్రాలు అందుకుంటున్న లబ్ధిదారులు

సాక్షి,గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ చక్కటి భరోసాను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నవులూరు ఎంఐజీ లేఔట్‌లో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నవారికి శనివారం విజయవాడలో ఈ–లాటరీ నిర్వహించారు. వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఎంఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.

ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఔట్‌లో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతోపాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. కాగా, నవులూరు ఎంఐజీ లేఔట్‌లో మొత్తం 147 మంది ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 104 మందిని అర్హులుగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్‌లైన్‌ ర్యాండమ్‌ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు.

చదవండి: ఎనీ డౌట్‌? కలామ్‌ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ

మరిన్ని వార్తలు