సీఎం ఆదేశాలు.. ప్రైవేట్‌కు ధీటుగా వాటి రూపురేఖలు మారనున్నాయి

26 Jun, 2022 13:41 IST|Sakshi

సీఎం ఆదేశాలతో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ డ్రైవ్‌

తొలిదశలో వ్యర్థాల తొలగింపు, వరద కాలువల అభివృద్ధి, అంతర్గత రహదారులకు మరమ్మతులు

జులై 5 నాటికి పనులు పూర్తి 168 ఐలాల్లో పనుల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు

ఐఆర్‌పీఎస్‌ ర్యాంకింగ్‌లో చోటే లక్ష్యం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఉన్న వీటిని ప్రైవేటు పార్కులకు దీటుగా హరిత పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఏపీఐఐసీ చేపట్టింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా యునైటెడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఏపీఐఐసీ ఈ చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా తొలుత పారిశ్రామిక పార్కుల్లో వ్యర్థాలను తొలగించి పచ్చదనాన్ని పెంచే విధంగా ఇండస్ట్రియల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ డ్రైవ్‌ పేరుతో 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 20న మొదలైన ఈ కార్యక్రమం జులై 5 వరకు జరుగుతుందని.. తొలిదశలో వ్యర్థాల తొలగింపు, వరద కాలువల అభివృద్ధి, అంతర్గత రహదారులకు మరమ్మతులపై దృష్టిసారించామని.. రానున్న రోజుల్లో మురుగు నీరు, వ్యర్థాల శుద్ధి, నీటి సదుపాయం వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించనున్నట్లు ఏపీఐఐసీ వీసీ–ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలోని 168 ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ (ఐలా)లను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.

స్థానిక సంస్థలతో సమన్వయం
రాష్ట్రంలోని 168 ఐలాలకు ఏటా రూ.120 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా వీటి నిర్వహణపై గత ప్రభుత్వాలు దృష్టిసారించలేదు. ఐలాలకు వచ్చే ఆదాయంలో 35 శాతం స్థానిక పురపాలక, గ్రామ పంచాయతీలకు వెళ్తుంది. పారిశ్రామికవాడల్లో వ్యర్థాల తొలగింపునకు సంబంధించి స్థానిక సంస్థలు, ఐలాల మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థలతో కలిసి వ్యర్థాలను తొలగించి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటోంది.

ఈ డ్రైవ్‌ ప్రారంభించిన మూడ్రోజుల్లోనే 100 కి.మీ పైగా రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, తుప్పలను తొలగించింది. అలాగే.. 14,000 మీటర్ల అంతర్గత రహదారులకు మరమ్మతులు, 33,543 మీటర్ల మేర వరద కాలువల్లో చెత్తను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని జులై 5కల్లా రాష్ట్ర పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారతాయన్న ఆశాభావాన్ని సుబ్రమణ్యం వ్యక్తంచేశారు.

ఐపీఆర్‌ఎస్‌లో చోటే లక్ష్యం
పెట్టుబడుల ఆకర్షణలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ రేటింగ్‌ సిస్టమ్‌ (ఐపీఆర్‌ఎస్‌) కీలకపాత్ర పోషిస్తుంది. ఐపీఆర్‌ఎస్‌ ర్యాంకింగ్‌లో ప్రభుత్వ రంగ పారిశ్రామిక పార్కులు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు పెంచడం ద్వారా ఐపీఆర్‌ఎస్‌ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఏపీలోని ఏపీఐఐసీ పార్కుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 50వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మౌలిక వసతులు లేకపోవడంతో చాలా చోట్ల యూనిట్లు పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఇప్పుడు మౌలిక వసతులు కల్పించడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

చదవండి: మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌

  
 

మరిన్ని వార్తలు