రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు?

27 Nov, 2020 05:44 IST|Sakshi

రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నప్పుడు.. మార్చే అధికారం ఎందుకుండదు?

పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించిన హైకోర్టు

అమరావతే రాజధాని అని చట్టంలో ఎక్కడా లేదు

మండలిలో పరిణామాలపై రికార్డులు, వీడియో ఫుటేజీలు ఇవ్వాలని శాసనసభ న్యాయవాదికి ఆదేశం

తదుపరి విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: శాసనసభ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు... అదే శాసనసభకు రాజధానిని మార్చే అధికారం ఎందుకు ఉండదని హైకోర్టు ప్రశ్నించింది. రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉన్నట్లు పునర్విభజన చట్టం, సీఆర్‌డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల బిల్లులు ఆమోదం పొందే సమయంలో శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన రికార్డులు, వీడియో ఫుటేజీని వెంటనే కోర్టుకు సమర్పించాలని శాసనసభ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. వెంటనే ఆ రికార్డులు ఇస్తామని శానససభ న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు హైకోర్టుకు నివేదించారు. అయితే బ్లూ కాపీ (అసెంబ్లీ రికార్డులు నిర్వహించే బుక్‌)ని మాత్రం స్పీకర్‌ అనుమతి తీసుకున్న తరువాతే ఇవ్వగలమని నివేదించారు. ప్రస్తుతం స్పీకర్‌ రాష్ట్రంలో లేరని, ఆయన వచ్చిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. (అమరావతిలో అణగారిన వర్గాలకు చోటులేదా?)

ఆ చట్టాల్లో అలా ఎక్కడుంది?
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన అంబటి సుధాకర్‌రావు వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, ఇప్పుడు రాజధానిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల రైతులకిచ్చిన హామీలను ఉల్లంఘించినట్లవుతుందన్నారు.

మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ పునర్విభజన చట్టం అమల్లో ఉన్నంత కాలం హైకోర్టును మార్చడానికి వీల్లేదన్నారు. హైకోర్టును మార్చేందుకు చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉందని పునర్విభజన చట్టం, సీఆర్‌డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. శానససభలో తీర్మానం చేయడం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని ఇంద్రనీల్‌ పేర్కొనగా.. మరి రాజధానిని నిర్ణయించడానికి శాసనసభకు అధికారం ఉన్నప్పుడు, దానిని మార్చే అధికారం కూడా శాసనసభకు ఉంటుంది కదా? అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.

‘ధర్మ’సందేహం!
1. రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నప్పుడు మార్చే అధికారం కూడా అసెంబ్లీకి ఉంటుంది కదా..?
2. అమరావతిని రాజధానిగా చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు ఎలా నిర్ణయించారు?
3. పిటిషన్లు దాఖలు చేసి విచారణకు హాజరు కాకపోవడం ఏమిటి? వాదనలు వినిపించని కేసులను విచారణ జాబితా నుంచి తొలగిస్తున్నాం. – హైకోర్టు ధర్మాసనం

విచారణ జాబితా నుంచి ఆ కేసుల తొలగింపు..
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరి వాదనలు ముగిసిన తరువాత, మిగతావారు వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా తమ ముందు హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసులను వరుసగా పిలిచి, ఏ కేసులో సంబంధిత న్యాయవాది వాదనలు వినిపించేందుకు రాలేదో వాటిని విచారణ జాబితా నుంచి తొలగించింది. కొందరి తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు