పథకాలు ఆపేయాలట!

23 Apr, 2022 05:10 IST|Sakshi

పేదలకు ఉచిత పథకాలు నిలిపి వేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందట

లేదంటే శ్రీలంకలా మారుతుంది అంటూ తప్పుడు కథనాలు 

ప్రజలు బాగుండటమంటేనే రాష్ట్రం బాగున్నట్టని దుష్ట చతుష్టయానికి చెప్పండి

ఒంగోలులో వైఎస్సార్‌ సున్నా వడ్డీ 

మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి రూ.1,261 కోట్లు జమ 

ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ.1.36 లక్షల కోట్లు

గత 35 నెలల్లో రూ.1,36,694 కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. ఇందులో రూ.94,318 కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల చేతుల్లోకి వెళ్లింది. కరోనా వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురు తిరిగినా, చెక్కుచెదరని సంకల్పం చూపించాం. నా ఇబ్బందులు నాకు ఉన్నా, వాటి ముందు మీ ఇబ్బందులే ఇంకా ఎక్కువ అని భావించి మీ సోదరుడిగా మీకు తోడుగా నిలిచాను. ఇంతలా మనసున్న పాలనను గతంలో మీరు ఎప్పుడైనా చూశారా? ఇంతటి సంక్షేమాభివృద్ధికి కారణమైన పథకాలను వాళ్లు ఆపేయాలంటున్నారు.. ఆపేయాలా? మీరే చెప్పండి.   – సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుండటం చూసి దుష్ట చతుష్టయం.. చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్, టీవీ5.. వారి దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముద్ర పడటంతో వారికి కడుపు మంట పెరిగిపోయిందని చెప్పారు. అక్కచెల్లెమ్మలందరూ సొంత కాళ్లపై నిలబడేలా పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతుండటం తట్టుకోలేక విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలన్నీ ఆపేయాలని, లేదంటే రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. ‘మీరే చెప్పండి.. ఈ పథకాలన్నీ ఆపేయాలా?’ అని అక్కచెల్లెమ్మలను ప్రశ్నించారు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆయన ఒంగోలులో ప్రారంభించారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి కోటి 2 లక్షల 16 వేల 410 మంది మహిళల ఖాతాల్లో రూ.1,261 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పీవీఆర్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ పథకం కింద ఈ మూడు సంవత్సరాల్లో రూ.3,615 కోట్లు అందజేశామని చెప్పారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ.. తదితర పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల చరిత్రను మార్చేస్తున్నామని తెలిపారు. కేవలం ఈ 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు నేరుగా ప్రజల చేతుల్లో పెట్టామని సగర్వంగా చెబుతున్నానన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

పేదల కడుపు నింపడం తమాషాలా?
– ఏ పథకంలోనూ ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు. బటన్‌ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. 1వ తేదీన పొద్దున్నే తలుపు తట్టి పింఛన్‌ అందిస్తున్నాం. ఏ పథకంలో అయినా ఎవరైనా మిస్‌ అయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే జూన్‌లో, డిసెంబర్‌లో అందిస్తున్నాం.
– అయితే ఇలాంటి పాలన వద్దని, మా బాబు పాలనే కావాలని దుష్ట చతుష్టయం, వారి దత్తపుత్రుడు అంటున్నారు. ఈనాడులో వాళ్లు రాస్తున్న రాతలు ఏంటో తెలుసా? ప్రభుత్వం డబ్బులు పంచే తమాషాలు ఇక ఆపాలట.. జగన్‌ ప్రభుత్వం నిర్వాకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం.. ఉచితంతో ఆర్థిక విధ్వంసం.. ఇవి రోజూ మన చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5లు మాట్లాడుతూ కలిసి రాస్తున్నారు.
– ఇబ్బందులు పడుతున్న నా అక్కచెల్లెమ్మలు, రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అవ్వ, తాతలు, పేదరికంతో అలమటిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని నా వాళ్లందరికీ పథకాలు అమలు చేయడానికి వీలు లేదనేది ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడి ఉద్దేశం.
– తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదల్చుకుందో అది వారి అధికార గెజిట్‌ పేపర్‌లో చెబుతుంటారు. దాదాపు రోజూ ఇటువంటి మాటలే. ఇటువంటి రాతలే. ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గోబెల్స్‌ ప్రచారం మొదలు పెట్టారు. చంద్రబాబులా.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే, ప్రజలకు వెళ్లాల్సిన సొమ్మంతా పాలకుల జేబుల్లోకి వెళితే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది ఈనాడు నిర్వచనం. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. 

మీరు ఒప్పుకుంటారా?
– లంచాలకు తావులేకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా? ఈ పథకాలన్నింటినీ ఆపేయాలని, చంద్రబాబుకు ఓటు వేస్తే వీటన్నింటినీ ఆపేస్తారని చెప్పకనే చెబుతున్నారు ఈ ఎల్లో మీడియా ప్రబుద్ధులు. దీనికి మీరు ఒప్పుకుంటారా? (ఒప్పుకోమంటూ అందరూ చేతులు పైకెత్తి ఊపారు) మీరు ఇలా గట్టిగా చెప్పడం వల్ల ఇప్పటికైనా ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు బుద్ధి వస్తుందని ఆశిద్దాం.
– మనందరి ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ రూ.13,022 కోట్లు జగనన్న అమ్మ ఒడి ద్వారా లబ్ధి కలిగించాం. ఈ పథకాన్ని ఆపేయాలా? 
– 52.40 లక్షల మంది రైతులు, కౌలు రైతు కుటుంబాలకు నేరుగా బటన్‌ నొక్కగానే వారి అకౌంట్‌లోకి డబ్బు వెళ్లిపోతోంది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు, అసైన్డ్‌ రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతన్నల కుటుంబాలు.. 52.40 లక్షల మందికి ఏకంగా రూ.20,162 కోట్లు నేరుగా ఇచ్చి మేలు చేశాం. ఈ పథకాన్నీ నిలిపివేయాలా? 
– ఏకంగా 25 లక్షల మంది 45 నుంచి 65 సంవత్సరాల వయస్సులోని అక్కచెల్లెమ్మలందరికీ మంచి చేస్తూ వైఎస్సార్‌ చేయూత పథకం తీసుకొచ్చాం. ఏటా వారికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తూ.. రిలయన్స్, అమూల్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థతో ఒప్పందాలు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేసి జీవనోపాధి చూపించాం. రూ.9,180 కోట్లతో అమలు చేస్తున్న ఈ పథకాన్నీ ఆపేయాలా? 
–    గతంలో చంద్రబాబు మోసం వల్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రూ.25,517 కోట్ల మేర అప్పులపాలయ్యారు. సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేశారు. అప్పులు తడిసి మోపెడై 18.36 శాతం సంఘాలు ఎన్‌పీఏలుగా మారి ఎదురీదారు. మనందరి ప్రభుత్వంలో 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇస్తే..ఆ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా?

– ఈ రోజు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరుతోనే ఇంటి స్థలాలు ఇచ్చాం. ఆ స్థలాల్లో ఇల్లు కట్టించే ఒక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఇది పూర్తయితే అక్కచెల్లెమ్మల చేతిలో ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్లు అవుతుంది. మొత్తంగా రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు వారి చేతుల్లో పెట్టినట్లు అవుతుంది. ఇటువంటి గొప్ప పథకాన్నీ ఆపేయాలా? (ఈ ప్రశ్నలన్నింటికీ ఒద్దు.. ఒద్దు.. అని ప్రజలు సమాధానమిచ్చారు) ఇలా ఎన్నో పథకాల ద్వారా మీకు తోడుగా నిలుస్తున్నాం. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తే కొద్దో గొప్పో మంచి జర్నలిజం అనేది కనిపిస్తుంది. 

మీరు కూడా ప్రశ్నించండి
– 18.50 లక్షల పంపు సెట్‌లకు ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద ద్వారా జరుగుతున్న మంచి ఏమిటో మీ అందరికీ తెలుసు. నాడు–నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్న స్కూళ్లు, ఆస్పత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. 

– వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా 62 లక్షల మంది జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా దాదాపు లక్ష మంది చేనేత కుటుంబాలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.3 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మంది అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరుగుతోంది. 

– జగనన్న చేదోడు ద్వారా మన రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు.. మొత్తం 3 లక్షల మంది కుటుంబాలకు మంచి జరుగుతోంది. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారం చేస్తున్న 14.16 లక్షల మందికి మేలు కలిగింది. వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా 2.75 లక్షల మంది సొంత ఆటోలు, సొంత క్యాబ్‌లు ఉన్న డ్రైవర్ల కుటుంబాలకు మంచి జరుగుతోంది.

– వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 95 శాతం ప్రజలకు గొప్ప మేలు జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకుని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నెలకు రూ.5 వేలు చొప్పున వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందిస్తున్నాం. ఇంకా గోరుముద్దు, సంపూర్ణ పోషణ.. ఇలాంటి పథకాలు కార్యక్రమాలన్నీ తీసి వేయాలన్నదే వాళ్ల ఉద్దేశం. 

– ఈ రోజు జగన్‌ చేస్తున్నది మంచా.. చెడా అన్నది మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఈ పథకాలన్నింటినీ నిలిపేయాలంటున్న ఎల్లో పార్టీలు, ఎల్లో మీడియా, వారి దత్తపుత్రుడిని నేను మీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా ప్రశ్నించండి. నిజంగా మీరు మనుషులేనా? అని అడగండి.

ఇంత మంచి ఎలా చేయగలుగుతున్నానో ఆలోచించండి
– జగన్‌ బటన్‌ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్‌ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ  ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్‌ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోంది.

– రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ రోజు 70 శాతం మంత్రి పదవులు వచ్చాయి. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాల వారికి ఇవ్వడం మహా సామాజిక విప్లవం. మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఈ వర్గాల వారే ఉన్నారు.  

– ఎక్కడో ఎందుకు.. ఈ ఎల్లో సభ్యులు నివాసం ఉంటున్న విజయవాడను ఒక్కసారి ఉదాహరణగా తీసుకుందాం. విజయవాడ మేయర్‌ జనరల్‌ స్థానంలో ఒక బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా జనరల్‌ స్థానంలో బీసీ మహిళ కనిపిస్తోంది. కనకదుర్గమ్మ తల్లి ఆలయ చైర్మన్‌గా బీసీ వ్యక్తికే అవకాశం కల్పించాం. 13 జిల్లాల జిల్లా పరిషత్‌ చైర్మన్‌లలో తొమ్మిది మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చాం. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా.. ఈ రోజు మీ అందరితో ఇన్ని విషయాలు పంచుకున్నాను. మీకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. 

చంద్రబాబు హయాంలో అయినా, మన హయాంలో అయినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అప్పులు దాదాపు ఒకటే. ఇంకా చెప్పాలంటే కాస్తో కూస్తో ఆయన కంటే మనమే తక్కువ అప్పులు చేస్తున్నాం. మరి అలాంటప్పుడు జగన్‌ ఎలా ఇంత మంచి చేస్తున్నాడు? ఆ పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు? అని అందరూ ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. జగన్‌ బటన్‌ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్‌ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ  ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్‌ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోందని సగర్వంగా తెలియజేస్తున్నా.  

మరిన్ని వార్తలు