ఉపాధి.. మరింత పెరిగేలా

5 Feb, 2022 04:27 IST|Sakshi

అవసరమైన మేర ఉపాధి హామీ పనిగంటలు పెంపు

వేసవిలో ఇబ్బందిలేకుండా ఉదయం, సాయంత్రం పనులు గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు 

రోజువారీ కూలి రూ. 245కు పెంచేందుకు చర్యలు

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇప్పుడు అందుతున్న కూలి కంటే ఎక్కువ మొత్తం దక్కేందుకు వీలుగా పనిగంటలు పెంచుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల డ్వామా పీడీలకు, ఉపాధి హామీ పథకం సమన్వయకర్తలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకం కింద పనిచేసే వారికి సరాసరిన రూ. 221ల చొప్పున కూలి అందుతోంది. అయితే, మన రాష్ట్రంలో గరిష్టంగా రూ.245 చొప్పున కూలి ఇచ్చే అవకాశముంది. ఇందుకనుగుణంగా రోజు వారీ కూలీ రూ.245 వచ్చేలా కూలీల పనిగంటలు పెంచుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ఆదేశాలు జారీచేశారు. 

వేసవిలో రెండు పూటలా హాజరయ్యేలా..
ఇక రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉ.6 గంటల నుంచి 10 గంటల మధ్య.. మళ్లీ మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు కూలీలు హాజరయ్యేలా చూస్తే మంచిదని జిల్లా అధికారులకు ఆయన సూచించారు. మరోవైపు.. కూలీలకు ఎక్కువసేపు పనిచేసి, ఎక్కువ మొత్తంలో వేతనం పొందేలా ప్రతి శ్రమశక్తి సంఘం (ఎస్‌ఎస్‌ఎస్‌ గ్రూపు)లో 40 మంది కూలీలు సభ్యులుగా ఉండేలా చర్యలు చేపట్టాలని  కూడా కమిషనర్‌ జిల్లా అధికారులకు సూచించారు. ప్రతి గ్రూపులో చదువుకున్న మహిళను మేట్‌గా నియమిస్తే ఆమెను వర్క్‌సైట్‌ సూపర్‌వైజరుగా గుర్తిస్తారు. కూలీల సమీకరణ, ప్రతి కూలీకి రూ.245 చొప్పున వేతనం దక్కేలా ఆయా కూలీలకు పనిని మార్కింగ్‌ చేసి ఇవ్వడం, పనికి హాజరయ్యే కూలీల మస్టర్లు నమోదు వంటి విధులను మేట్‌ నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మేట్‌ నమోదు చేసే మస్టర్లను గ్రామంలోని ఫీల్డు అసిస్టెంట్‌ ధృవీకరించి సంతకం చేయాల్సి ఉంటుంది. 

రోజూ లక్ష మందికి పని..
గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గుముఖంపడుతుండడంతో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన పెంపుపై గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి పెట్టింది. ఇక నుంచి వచ్చే 40 రోజులతోపాటు ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం లక్ష మందికి ఉపాధి  పనుల కల్పనకు సిద్ధంగా ఉండాలని గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లో మార్చి నెలాఖరులోగా ఐదు కోట్ల పనిదినాల పనుల కల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

మరిన్ని వార్తలు