అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం 

5 Jul, 2022 13:04 IST|Sakshi
పిచ్చుకలపాలెం వద్ద రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌

జోన్‌–4లో రూ.192.52 కోట్లతో మౌలిక వసతులు

పనులు ప్రారంభించిన సీఆర్‌డీఏ కమిషనర్‌

రూ.150 కోట్లతో కరకట్ట రోడ్డు విస్తరణ

నిధుల సమీకరణకు టౌన్‌షిప్పుల అభివృద్ధి, అమ్మకం: సీఆర్‌డీఏ కమిషనర్‌   

సాక్షి, అమరావతి: ల్యాండ్‌ పూలింగ్‌ కింద అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల అభివృద్ధికి ఏపీ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) చర్యలు చేపట్టింది. రైతులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు సీఆర్‌డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడ రైతులకు కేటాయించిన ప్లాట్లను 12 జోన్లుగా విభజించగా, వాటిలో జోన్‌–4లోని పిచ్చుకలపాలెం, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో ఉన్న ప్లాట్లలో పనులు ప్రారంభించారు.

సోమవారం పిచ్చుకలపాలెం వద్ద రహదారి నిర్మాణాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్పీఎస్‌ ప్లాట్లను పూర్తి కమర్షియల్‌ విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జోన్‌–4లో మొత్తం 1358.42 ఎకరాల్లో 4,551 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.192.52 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులు కోరుకున్న విధంగా ప్లాట్లను తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ షేక్‌ అలీంబాషా, చీఫ్‌ ఇంజినీర్లు టి.ఆంజనేయులు, సీహెచ్‌ ధనుంజయ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శరవేగంగా అభివృద్ధి పనులు 
ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ అమరావతిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది. అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైన కృష్ణా నది కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో విస్తరిస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది నివాస సముదాయాల పనులు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్‌ నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు.

అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు చేపట్టామని వివేక్‌ యాదవ్‌ తెలిపారు. నిబంధనలకు లోబడి అమరావతి ప్రాంతంలో టౌన్‌షిప్‌లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు. రైతులకు కౌలు డబ్బును కూడా సకాలంలో చెల్లిస్తున్నట్టు వివరించారు.  

 

మరిన్ని వార్తలు