ఉత్తరాంధ్ర,  సీమ జిల్లాలకు.. టీడీపీ ద్రోహం

12 Feb, 2022 04:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు గత తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నాయో వివరిస్తూ ఐదేళ్ల కాలంలో రూ.24,350 కోట్లు ఇవ్వాలని అధికారులు సవివరమైన నివేదికను కేంద్రానికి సమర్పించారు. కానీ, నాటి ముఖ్యమంత్రి ఈ నిధుల సాధనలో పూర్తిగా చతికిలపడ్డారు. స్వయాన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రే ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన  సమాధానంతో ఈ విషయం తేటతెల్లమైంది.

అధికారులు రూపొందించిన లెక్కల ప్రకారం నిధులు సాధించాల్సిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. జిల్లాకు ఏడాదికి కేవలం రూ.50 కోట్లు ఇస్తామంటే ఆయన ఓకే చెప్పారు. అంటే ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు కేంద్రం ఇస్తానంటే చంద్రబాబు అందుకు సరేనన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మూడేళ్లపాటు రూ.350 కోట్ల చొప్పున విడుదల చేయగా ఆ నిధులనూ టీడీపీ సర్కారు సక్రమంగా వినియోగించలేదు. వాటి వినియోగ పత్రాలు సమర్పిస్తేనే తదుపరి నిధులు ఇస్తామని స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం.. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి వాటి విడుదలను నిలుపుదల చేసింది. అలాగే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కూడా పైసా ఇవ్వలేదు. ఒక రకంగా వేల కోట్ల రూపాయలు ఆ జిల్లాలకు రాకుండా చేయడమే కాక, కేంద్రం ఇస్తానన్న అరకొర నిధులు కూడా రాకుండా చంద్రబాబు ఆ ప్రాంతాలకు తీరని ద్రోహం చేశారు. ఈ జిల్లాల్లో అక్షరాస్యత పెంచడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులను వినియోగించాల్సి ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యహరించింది.

టీడీపీకి భిన్నంగా వైఎస్సార్‌సీపీ..
అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 2019–20లోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.350 కోట్లను కేంద్రం నుంచి సాధించింది. అలాగే.. 2020–21 ఆర్థిక ఏడాదిలో కూడా మరో రూ.350 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించింది. అంతేకాక.. సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సమయంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కోరిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌. నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదిరి వెనుకబడిన జిల్లాల నిధుల విడుదల వివరాలను వెల్లడించారు.   

మరిన్ని వార్తలు